తెలంగాణ: హైదరాబాద్‌ను వరుణుడు వదలడం లేదు. గత కొన్నిరోజులుగా వాన భీబత్సానికి నగరం అతలాకుతలం అయ్యింది. నిన్న రాత్రి మరోసారి కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం నీటి మయం అయ్యింది. వాగులు, వంకలు, చెరువులు నదులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో పలుప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. తాజాగా శనివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రహదారులు మొత్తం జలమయమయ్యాయి. దీంతో పలు రాహదారుల్ని అధికారులు మూసివేశారు.
మలక్‌పేట రైలు వంతెన, ముసారాంబాగ్ వంతెన రోడ్లు మూసివేశారు. చాదర్‌ఘాట్, పురానాపూల్ 100 ఫీట్‌రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. గడ్డిఅన్నారం నుంచి శివగంగ రోడ్లు అదేవిధంగా బండ్లగూడ మీదుగా ఆరాంఘర్ వెళ్లే దారి, మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్డు నుంచి ఐఎస్ సదన్‌కు వెళ్లే రోడ్డును మూసివేశారు. మరోవైపు తెలంగాణకు మరోసారి భరీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని, దీంతో రానున్న రెండురోజులపాటు భారీ వర్షాలు కురవవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
చాదర్ ఘాట్ మూసీ పరివారక ప్రాంత వరద బాధిత ప్రజలను పరామర్శించి వారికి ఆహారాన్ని అందిచేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీని మజ్లీస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. పాతబస్తీలో ఇతర పార్టీ నేతలు తిరగవద్దంటూ అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. షబ్బీర్ అలీ మాట్లాడుతూ మజ్లీస్ పార్టీ నేతల గుండా గిరి.. నగరంలో రోజురోజుకీ మితిమీరి పోతుందని విమర్శించారు.
ఐదు రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంపు ప్రాంతాలలో నివాసమున్న వరద బాధితులను పరామర్శించి వారికి ఆహారం, దుప్పట్లు, ఆర్థిక సహాయం అందించేందుకు వస్తే ఎంఐఎం పార్టీ నేతలు అడ్డుకోవడం దారుణం అని షబ్బీర్ అలీ మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా మానవత్వంతో బాధితులను ఆదుకోవడానికి వచ్చిన వారిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఐఎం నేతలు ఏ సాయమూ చేయకుండా ఇతరులను సైతం పెట్టకుండా చేస్తున్నారని అన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అందర్నీ చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.