తెలంగాణ ఏర్పడిన తర్వాతే కాదు.. అంతకు ముందు కూడా ఉపఎన్నిక అంటే.. టీఆర్ఎస్ అభ్యర్ధికి మెజార్టీ ఎంత వస్తుందనే చర్చ ఉండేది. సెంటిమెంట్ ఎంత స్థాయిలో ఉంటే.. అంత భారీ స్థాయిలో మెజార్టీ వచ్చేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అదే పరిస్థితి. కానీ ఇప్పుడు దుబ్బాక ఉపఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. టీఆర్ఎస్ గెలుస్తుందా.. లేదా అన్న చర్చే ఎక్కువగా సాగుతోంది. అందుకే .. సీఎం కేసీఆర్ కూడా.. మెజార్టీ గురించి చెప్పలేదు కానీ.. గెలుస్తున్నామనే వాదన మాత్రం వినిపించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గురించి జరిగిన చర్చ తక్కువ.. మొత్తం బీజేపీ గురించే చర్చ జరిగింది. ఫలితంగా ఆ పార్టీకి అడ్వాంటేజ్‌గా మారినట్లుగా కనిపిస్తోంది.
టీఆర్ఎస్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా తమ పాలన.. పథకాల గురించి కాకుండా.. బీజేపీ గురించి ప్రజలకు చెప్పడం ప్రారంభించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావును టార్గెట్ చేసిన వైనం కూడా ప్రజల్లో చర్చకు కారణం అయింది. హరీష్ రావు.. మొత్తంగా బీజేపీని ప్రజల్లో బ్యాడ్ చేద్దామనుకునుని విస్తృతంగా విద్యుత్ మీటర్లు.. పథకాల్లో కేంద్ర నిధులు .. వ్యవసాయ బిల్లులు అంటూ చెప్పుకొచ్చారు కానీ.. అవి.. బీజేపీ గురించి ప్రజల్లో మరింత చర్చ జరగడానికి కారణం అయింది కానీ.. వ్యతిరేకత పెరగడానికి కారణం కాలేదన్న అభిప్రాయం పోలింగ్ సరళిని చూసిన విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత హరీష్ రావు కాస్త నిరాశగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ చివరి వరకూ తప్పుడు ప్రచారం చేసిందని.. కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం పరాకాష్ట అని మండిపడ్డారు. బీజేపీ గెలిచిపోయిందంటూ తప్పుడు వాయిస్ కాల్స్ పంపుతూ.. ప్రజలను అయోమయంలో పడేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మామూలుగా అయితే టీఆర్ఎస్‌లో ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత జోష్ కనిపించాలి. తెలంగాణ భవన్ ముందు పటాసులు పేల్చాలి. కానీ ఈ సారి మాత్రం.. ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీకి అతి ప్రచారం చేసి.. ఆ పార్టీకి మేలు చేశారన్న అభిప్రాయం టీఆర్ఎస్‌లోనూ ప్రారంభమయింది.