తెలంగాణలో వరుస విజయాలతో ఊపు మీద ఉంది బీజేపీ . పార్లెమెంట్ ఎన్నికల్లో అధికార పక్షానికి షాకిచ్చే రీతిలో నాలుగు స్థానాల్లో గెలిచారు. ఏకంగా కేసీఆర్ కుమార్తె కవితను ఓడించారు. అలాగే దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం తెరాసకు షాకిచ్చారు. అన్నింటికీ మించి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటి బలపడ్డామని నిరూపించుకున్నారు. ఈ వరుస విజయాలతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టింది అధిష్టానం. తెరాసలోని అసంతృప్తులు, కాంగ్రెస్ పార్టీలోని నేతలకు వాలా వేసే పని పెట్టుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నుండి విజయశాంతిని పార్టీలోకి తీసుకెళ్లగలిగారు. అలాగే ఇంకొందరు లీడర్ల మీద దృష్టి పెట్టారు. వారిలో కొండా దంపతులు కూడ ఉన్నారు.
కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో మంచి పేరుంది. అక్కడ అధికార పార్టీని తీవ్రంగా ధిక్కరించి రాజకీయం చేయగలుగుతున్నారు కొండా దంపతులు. 2014లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తెరాస తరపున గెలిచి కొండా సురేఖ కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పరకాలలో పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయినా ఆమె దూకుడు తగ్గించలేదు. ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల్లోనే తిరిగి యాక్టివ్ అయ్యారు. పరకాల, తూర్పు నియోజకవర్గాల్లో శ్రేణులను యాక్టివ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడ వరంగల్ బాధ్యతలను వారికే వదిలేసింది. త్వరలో వరంగల్ మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో కొండా దంపతుల వర్గం కీలకంగా మారనుంది. వారి మద్దతు ఉంటే ఏ పార్టీ అయినా కొన్ని స్థానాలు గెలుచుకునే వీలుంది.
అందుకే వారి మీద బీజేపీ దృష్టి పెట్టింది. వారిని పార్టీలోకి లాగాలని చూసింది. ఈమేరకు కొండా దంపతుల పార్టీ మార్పు అంటూ ప్రచారం కూడ మొదలుపెట్టింది. కొండా దంపతుల కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ హామీ మీద చర్చలు నడుస్తున్నాయని గుసగుసలు వినబడ్డాయి. ఒకానొక దశలో కొండా దంపతులు స్పందించకపోవంతో అంతా అదే నిజమనుకున్నారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ నేరుగా కొండా దంపతులతో సంప్రదింపులు జరిపారట. దీంతో వారు పార్టీ మారట్లేదని, కాంగ్రెస్ పార్టీలో తమకు సౌకర్యంగానే ఉందని క్లారిటీ ఇచ్చేశారు. మాణిక్యం ఠాగూర్ మాటలతో వారిలో పుట్టుకొచ్చిన పార్టీ మార్పు ఆలోచనలు అడుగంటిపోయాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ఈ రకంగా కొండా దంపతులను వలలో వేసుకుని వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలో చక్రం తిప్పాలనుకున్న బీజేపీ ప్రయత్నాలకు బ్రేకులుపడ్డాయి.