ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్సీల రాజీనామా

ఇద్దరు టిఆర్ఎస్ నేతలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో శాసన మండలిలో రెండు ఖాళీలు ఏర్పడుతాయి. వారి స్థానంలో మరో ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడంతో ఆ ఇద్దరు నేతలు తమ శాసన మండలి పదవులకు రాజీనామా చేయనున్నారు. గురువారం సాయంత్రం తమ రాజీనామా లేఖలు వారు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు సమర్పించనున్నారు.

ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొడంగల్ లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి  పై 9 వేల ఓట్ల మెజార్టీతో పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. కొడంగల్ నియోజకవర్గం పై ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అందరి దృష్టి ఉంది. రేవంత్ రెడ్డి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ కీలక నేతగా ఎదిగారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం పై నిత్యం విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ అయ్యారు.

రేవంత్ రెడ్డి పై పట్నం నరేందర్ రెడ్డి గెలుపు అంత ఈజీ కాదని అంతా భావించారు. కానీ కొడంగల్ ప్రజలు ఊహించని విధంగా ఫలితాలు ఇచ్చారు. ఒకనొక దశలో పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ టికెట్ వచ్చాక పోటి చేయానని అన్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసి దూసుకెళ్లారు. అంతిమంగా రేవంత్ రెడ్డి పై విజయం సాధించి కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పట్నం నరేందర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు.

మరో ఎమ్మెల్సీ మైనంపల్లి  హన్మంత రావు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్ గిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మైనంపల్లి హన్మంతరావు ప్రస్తుతం టిఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా  కూడా ఉన్నారు. అయితే మైనంపల్లికి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే సీటు అంత ఈజీగా రాలేదు. 

మల్కాజ్ గిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ కావాలని మైనంపల్లి హన్మంతరావు డిమాండ్ చేయగా ముందుగా టిఆర్ఎస్ ఒప్పుకోలేదు. దీంతో టిఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు మైనంపల్లి సిద్దపడ్డారు. మైనంపల్లి రాజీనామా చేయనున్నారన్న విషయం తెలుసుకొని మంత్రి కేటిఆర్ అలర్ట్ అయ్యారు. మైనంపల్లి గతంలో టిడిపిలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ అధ్యక్షులు రాజీనామా చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని భావించారు. కేటిఆర్ వెంటనే మైనంపల్లి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి టికెట్ కేటాయించారు. మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు ఘన విజయం సాధించారు.  దీంతో ఎమ్మెల్సీ పదవికి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేయనున్నారు.

సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం కాగానే ఈ ఇద్దరు టిఆర్ఎస్ నేతలు తమ శాసన మండలి స్థానాలకు రాజీనామా చేయనున్నారు. రాజీనామా లేఖలను మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు సమర్పించనున్నారు. ఈ ఇద్దరి రాజీనామాతో శాసనమండలిలో రెండు స్థానాలు ఖాళీలు కానున్నాయి. ఈ రెండు స్థానాలలో ఓటమి పాలైన ఇద్దరు కీలక నేతలకు అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.