అశోక్‌ గల్లా.. ‘దేవకీ నందన వాసుదేవ’ టైటిల్‌ ఖరారు!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా ‘హీరో’ సినిమా తర్వాత రెండో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘దేవకీ నందన వాసుదేవ’ అనే టైటిల్‌తో ఈ సినిమా రానుండగా.. జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి కథనందిస్తున్నాడు. ‘గుణ 369’ ఫేం అర్జున్‌ జంధ్యాలదర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో అశోక్‌ గల్లా సరసన హీరోయిన్‌గా మాజీ మిస్‌ ఇండియా (2020) మానస వారణాసి నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్‌ పోస్టర్‌తో పాటు, టీజర్‌ను విడుదల చేయగా మంచి స్పందన లభించింది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మ్యూజికల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. అశోక్‌గల్లా పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఫస్ట్‌ సింగిల్‌ ఏమయ్యిందే అనే రోమాంటిక్‌ మెలోడిని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ‘ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు.. నీ వల్లే కాదని అనకు.. ఏమయ్యిందో తెలిసే వరకు’ అంటూ సాగిన ఈ ప్రేమ పాట సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

భీమ్స్‌ సిసిరోలియో కంపోజ్‌ చేసిన ఈ పాటకు సురేష్‌ గంగుల లిరిక్స్‌ అందించాడు. ఈశ్వర్‌ దత్‌ పాడాడు. ఇక త్వరలోనే షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేయనున్నారు. ఈ మూవీని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తుండగా.. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌ కాగా.. తమ్మిరాజు ఎడిటర్‌. కార్తికేయ హీరోగా అర్జున్‌ జంధ్యాల చివరగా డైరెక్ట్‌ చేసిన ‘గుణ 369’ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అర్జున్‌ జంధ్యాల.