రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా

‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్టీల్రోకి ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు రవికిరణ్‌ కోలా. కిరణ్‌ అబ్బవరం హీరోగా, రహస్య గోరక్‌ హీరోయిన్‌గా 2019లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక తన మొదటి సినిమాతోనే సక్సెస్‌ అందుకున్న కిరణ్‌, ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు రవికిరణ్‌ కోలా తన కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే.

టాలీవుడ్‌ టాప్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తన కొత్త ప్రాజెక్ట్‌ను రవికిరణ్‌ కోలాతో చేయబోతున్నట్లు గతేడాది సోషల్‌ విూడియాలో ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వచ్చిన అనంతరం కొత్తగా ఎటువంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ను పంచుకుంది.

రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో వచ్చే ఈ ప్రాజెక్ట్‌లో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించబోతున్నాడు. రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను మే 9న ప్రకటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి అంటూ శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌ సోషల్‌ విూడియాలో పోస్ట్ చేసింది.