ప్రగతి సభకు బిటి బ్యాచ్ సక్కదనం ఏందబ్బా ??? (వీడియోలు)

ప్రగతి నివేదన సభ సెప్టెంబరు 2వ తేదీన అట్టహాసంగా జరిపేందుకు టిఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లక్షల మందిని తరలించి తడాఖా చూపుతామని ప్రకటించింది. లక్ష వాహనాల్లో జనాలు హైదరాబాద్ కు తరలివస్తారని చెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఒక్క విషయం మాత్రం ఇటు జనాలకు అటు టిఆర్ఎస్ నేతలకు కూడా అంతు చిక్కడం లేదు.  ముఖ్యంగా టిఆర్ఎస్ లోని యూటి బ్యాచ్ (ఉద్యమ తెలంగాణ) కి అస్సలు అర్థమైతలేదు. ఈ బిటి బ్యాచ్ సక్కదనమేందబ్బా అని యూటి బ్యాచ్ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇంతకూ అసలు కథేందో చదవండి. కింద జబర్దస్త్ వీడియోలు ఉన్నాయి చూడండి.

ప్రగతి సభ సెప్టెంబరు 2వ తేదీన అయితే ఆగస్టు 31వ తేదీ నుంచే తెలంగాణలోని బిటి బ్యాచ్ హల్ చల్ మొదలు పెట్టింది. ప్రగతి సభ సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం నాలుగైదు గంటలకు ఉండగా రెండు రోజుల ముందే ట్రాక్టర్లు కట్టుకుని సభకు పోతున్నట్లు కలరింగ్ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో బహిరంగసభలు అంటే విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కడప, శ్రీకాకుళం లాంటి జిల్లాలు సుదూరంగా ఉంటాయి కాబట్టి అక్కడి వారు సభకు రావాలంటే రెండు రోజుల ముందే బయలుదేరుతారు.

కానీ తిప్పి తిప్పి కొడితే 200 కిలోమీటర్లు లేని ఖమ్మం జిల్లా వాళ్లు రెండు రోజుల ముందే ట్రాక్టర్ల మీద బయలుదేరుడేందబ్బా అని అందరూ షాక్ అవుతున్నారు. ఇంకా ఇక్కడ మరీ విచిత్రమైన ముచ్చటేమంటే?? ఖమ్మం జిల్లా నుంచి 2వేల ట్రాక్టర్లలో జనాలను తరలిస్తున్నట్లు ఖమ్మం జిల్లాలో బంగారు తెలంగాణ కోసం చేరిన నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. వారు ట్రాక్టర్లకు జెండా ఊపి ప్రారంభించారు.

ఇది ఇట్లా ఉంటే ఆ ట్రాక్టర్లకు జెండా అయితే ఊపారు కానీ.. ట్రాక్టర్ లో జనాలు అసలే లేరు. కొన్ని ట్రాక్టర్లలో అయితే కేవలం డ్రైవర్లు మాత్రమే వస్తున్నారు. ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ అంత పెద్ద ట్రాక్టర్ ను వేసుకుని 200 కిలోమీటర్లు ప్రయాణించడం అవసరమా? అని జనాలు అనుకుంటున్నారు. సిఎం కేసిఆర్ మాట వరుసకు ట్రాక్టర్లు కట్టుకుని రాండి అంటే బిటి బ్యాచ్ అత్యుత్సాహంతో జనాలు లేకుండా ఖాళీ ట్రాక్టర్లను రోడ్లమీదకు తెచ్చి హల్ చల్ చేస్తున్నారని అంటున్నారు. 

ఇక్కడ ఇంకో కిటుకు కూడా ఉండొచ్చని యూటి బ్యాచ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. అదేమంటే.. ట్రాక్టర్ మీద ఒక్కడ డ్రైవర్ మాత్రమే సభకు వస్తే కేవలం డీజిల్ ఖర్చుతోపాటు ట్రాక్టర్ డ్రైవర్ కు ఫుడ్డు, బత్తా ఇస్తే సరిపోతుంది.. అదే జనాలను ట్రాక్టర్ లో తీసుకొస్తే వాళ్లకు తిండి, తాగుడు ఉత్తగనే అయితదా? అందుకే ఇలాంటి ప్లాన్ వేశారేమో అని కరీంనగర్ కు చెందిన ఒక టిఆర్ఎస్ నేత సరదాగా వ్యాఖ్యానించారు. 

ఖమ్మం నుంచే కాకుండా మరికొన్ని జిల్లాల నుంచి కూడా ఇదే తరహాలో ఖాళీ బండ్లు తరలించినట్లు వార్తలొచ్చాయి. టిఆర్ఎస్ సభ అంటే జనాలు రావడం పక్కా.. అనే ప్రచారం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నదే. కానీ ఈ అత్యుత్సాహం ఎందుకబ్బా అని పార్టీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఖాళీ ట్రాక్టర్ల వీడియోలు పైన ఉన్నాయి చూడండి.