వామ్మో, ఆ పోస్టులంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దడ

అవును మీరు చదివింది నిజమే. బంపర్ మెజార్టీ సాధించి మాంచి జోష్ మీదున్నది టిఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే కేసిఆర్ సిఎంగా ప్రమాణం చేశారు. ఆయన కొడుకు కేటిఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ అయ్యారు. రేపో మాపో మంత్రులుగా ప్రమాణం చేసేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. కేసిఆర్, ప్రస్తుత హోంమంత్రి మహమూద్ అలీ పోను మరో 16 మంత్రి పదవులే మిగులుతాయి. పోటీ తీవ్రంగా ఉంది. ఒకవేళ మంత్రి పదవి రానివారికి వేరే పదవులు కూడా ఇచ్చే చాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవులు ఒకే కానీ వేరే పదవులు అంటే మాత్రం కొందరు ఎమ్మెల్యేలకు గుండెల్లో దడ పుడుతున్నది. ఇంతకూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అంతగా దడ పుట్టిస్తున్న ఆ పదవులేంటి? 

కేసిఆర్ తో మధుసూదనాచారి, స్వామి గౌడ్

ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుకొని రెండు తెలుగు రాష్ట్రాల చరిత్ర తీసుకుంటే రాజకీయంగా కొన్ని పోస్టులు తీసుకోవాలంటే నాయకులు భయపడే పరిస్థితి ఉంది. ఆ పోస్టులో పోయామంటే ఇక రాజకీయ భవిష్యత్తు ప్రమదంలోకి నెట్టబడ్డట్లే అన్న భావన నాయకుల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీలో కూడా కొన్ని పోస్టులకు మాంచి డిమాండ్ ఉంటే ఆ రకమైన పోస్టులకు మాత్రం అసలే డిమాండ్ లేదు. పైగా ఇస్తానంటే వద్దంటాను అన్నట్లు ఉన్నారు నాయకులు. 

మధుసూదనాచారి

ఆ పోస్టుల్లో అతి ముఖ్యమైనది స్పీకర్ పదవి. ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి తెలంగాణ వరకు అనేక మంది స్పీకర్ గా పనిచేసిన వారు తదుపరి టర్మ్ లో రాజకీయంగా ఇబ్బంది పడ్డ చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కే.ఆర్ సురేశ్ రెడ్డి స్పీకర్ గా ఉన్నారు. తర్వాత ఆయన ఓటమిపాలయ్యారు. ఇప్పటి వరకు ఆయన పాలిటిక్స్ లో సైడ్ అయిపోయారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయ్యారు. కానీ ఆయన తదుపరి సిఎం అయినా తుదకు రాజకీయంలో పాతాలానికి పడిపోయారు. అలాగే నాదెండ్ల మనోహర్ స్పీకర్ అయినా ఆయన సయితం రాజకీయాల్లో అస్తిత్వం కోసం కొట్టుమిట్టాడుతున్నారు అంతుకుమందు కూడా చాలామంది ఇలాగే ఇబ్బందిపడ్డారు. ఇక తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి కూడా ఈసారి ఎన్నికల్లో ఓటమిచెందారు. అందుకే స్పీకర్ పదవి నాకొద్దంటే నాకొద్దంటున్నట్లు చర్చ సాగుతోంది. ఏ పోస్టు వచ్చినా మంచిదే కానీ ఆ పోస్టు మాత్రం తీసుకోవద్దు అని నాయకుల అనుచరులు వత్తిడి తెస్తున్నారట.

సోమారపు సత్యనారాయణ

ఇక ఇదే కాకుండా ఆర్టీసి ఛైర్మన్ పదవి పట్ల కూడా అనాసక్తి చూపుతున్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆర్టీసి ఛైర్మన్ పదవి చేపట్టిన వారంతా ఇబ్బందులపాలైనట్లు సెంటిమెంట్ ఒకటి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసి ఛైర్మన్ గా గోనె ప్రకాష్ రావు ఉన్నారు. ఆయన నిజాయితీగా ఆ పోస్టులో పనిచేసినట్లు ఇప్పటికీ చెబుతారు. సాయంత్రం పనివేళలు ముగియగానే ప్రభుత్వం కేటాయించిన వాహనం దిగి సొంత డబ్బు పెట్టుకుని ఆటోలో వెళ్లిపోతారని, అంత నిజాయితీగా పనిచేశారని చర్చ ఉంది. అయితే ఆయన ఆ పదవి చేపట్టిన తర్వాత నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు.

ఆయనే కాదు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన ఎమ్మెస్సార్ (ఎం సత్యనారాయణరావు) ఆర్టీసి ఛైర్మన్ పదవి తీసుకున్న తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమైన పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసి ఛైర్మన్ పదవిని చేపట్టిన సోమారపు సత్యనారాయణ పరిస్థితి కూడా అలాగే ఉంది. తెలంగాణలో కారు జోరు కొనసాగినా సోమారపు సత్యనారాయణ మాత్రం రామగుండంలో ఓటమిపాలయ్యారు. ఆయన ఏ ప్రత్యర్థి చేతిలో ఓడిపోతే అదివేరు. కానీ ఇండిపెండెంట్ (టిఆర్ఎస్ రెబెల్) కోరుకంటి చందర్ చేతిలో ఓడిపోవడం జరిగింది. దీంతో ఆర్టీసి ఛైర్మన్ పదవి విషయంలో చాలా మంది నేతలు అయిష్టత చూపుతున్నట్లు టాక్ ఉంది.

ప్రతిపక్ష కాంగ్రెస్ లోనూ ఆ పోస్టు అంటే దడే

అధికార పక్షమే కాదు ప్రతిపక్షానికి కూడా ఒక సెంటెమెంట్ తయారై ఉంది. రాజ్యాంగ బధ్ధంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యేకు పిఎసి ఛైర్మన్ పదవి ఇవ్వడం ప్రొసీజర్. అయితే తెలంగాణ రాష్ట్రంలో పిఎసి ఛైర్మన్ పదవి తీసుకున్న ఇద్దరు అకస్మాత్తుగా మరణించడం విషాదం నింపింది. తొలుత ఈ పదవిని తీసుకున్న వ్యక్తి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి. కానీ ఆయన 2015 ఆగస్టులో గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత అదే పోస్టు తీసుకున్న ఖమ్మం జిల్లా పాలేరు సభ్యుడు రాంరెడ్డి వెంకట్ రెడ్డి కూడా 2016 మార్చిలో అనారోగ్యంతో మరణించారు. అంతేకాదు ఆతర్వాత ఆ పదవి గీతారెడ్డి తీసుకున్నారు. కానీ గీతారెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 

గీతారెడ్డి

మొత్తానికి ఈ మూడు పోస్టులను ఎవరికిస్తారన్నది పక్కన పెడితే తీసుకునేందుకు మాత్రం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఇక అసలే తెలంగాణ స్వరాష్ట్రంలో సిఎం కేసిఆర్ ప్రతి పనికి జ్యోతిష్యం, ముహూర్తం, సంఖ్యా శాస్త్రం అంటూ వ్యవహారం నడుపుతున్నారు. అధినేత అలా ఉంటే అందరూ ఆయన బాటలోనే నడుస్తున్నారు. దీంతో సెంటిమెంట్లను కేసిఆర్ లాగే పార్టీ నేతలు కూడ ానమ్ముతున్నారు. కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాయకులకు ఈ పోెస్టులు కట్టబెట్టే చాన్స్ ఉందని చెబుతున్నారు. వారైతేనే ఈ సెంటిమెంట్లు పట్టించుకోరన్న చర్చ ఉంది.