గడప దాటొద్దు : వారికి కేసిఆర్ ఆదేశాలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి కొనసాగుతున్నది. ఇప్పటికే 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి టిఆర్ఎస్ ప్రతిపక్షాలకు గట్ట ిసవాల్ విసిరింది. మరోవైపు విపక్షాలన్నీ మహా కూటమిగా జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నాయి. సీట్ల కేటాయింపులపై విపక్షాల కూమిటి కసరత్తు చేస్తున్నది. కూటమిలో కాంగ్రెస్, సిపిఐ, టిడిపి, తెలంగాణ జన సమితి జట్టుగా ఉన్నాయి. ఈ కూటమికి సిపిఎం దూరంగా ఉంది. బిఎల్ఎఫ్ పేరుతో కుల సంఘాలతో సిపిఎం జట్టు కట్టింది. బిఎల్ఎఫ్ తరుపున పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఇక మరో ప్రధాన పార్టీ అయిన బిజెపి ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నది. తాజా పరిస్థితులు చూస్తే సినీ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తెలంగాణలో ఏరకమైన రీతిలో పోటీ చేస్తుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు. జనసేనతో కలిసి పోటీ చేసేందుకు సిపిఎం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బిఎల్ఎఫ్ లో జనసేన కలిసి రావాలని కోరుతున్నారు.

ఇక కొంగర కలాన్ సభావేదికగా ఎన్నికల నగారా మోగించిన కేసిఆర్ వెనువెంటనే హుస్నాబాద్ లో భారీ భహిరంగసభ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. అయితే ఆ సభ తర్వాత వెనువెంటనే సభలు ఉంటాయని గులాబీ శ్రేణులు చెప్పినప్పటికీ రెండో సభ పై ఇంకా క్లారిటీ రాలేదు. వంద సభల్లో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రసంగం చేయనున్నట్లు గులాబీ నేతలు తెలిపారు. రోజుకు రెండు సభల చొప్పున కేసిఆర్ వంద సభల్లో మాట్లాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. హెలిక్యాప్టర్ లోనే కేసిఆర్ ఈ సభలకు హాజరవుతారని చెబుతున్నారు.

ఇప్పటికే 105 మంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే తెలంగాణ మంత్రులుగా పనిచేసిన వారికి కేసిఆర్ గట్టి సలహా లాంటి హెచ్చరిక చేసినట్లు తెలిసింది. అదేమంటే మంత్రులెవరైనా తమ నియోజకవర్గం దాటి కాలు బయటపెట్టరాదన్నది ఆ ఆదేశం సారాంశం. ఉమ్మడ ి జిల్లాలను పరిగణలోకి తీసుకుంటే ప్రతి జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారు మంత్రులు కాబట్టి సహజంగానే ఉమ్మడి జిల్లా పరిధిలో తమ నాయకత్వం చెలామణి కావాలని కోరుకుంటారు. కానీ మంత్రులెవరైనా సరే సొంత నియోజకవర్గం దాటి బయట కాలు పెట్టడానికి వీలు లేదని అధినేత నుంచి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు.

ఇలాంటి ఆదేశాలు జారీ కావడం వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నాయన్న చర్చ జరుగుతున్నది. అందులో తెలంగాణ మంత్రుల్లో ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ తో పాటు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి ఎక్కడా సీటు కేటాయించలేదు. ప్రస్తుతం వీరు ముగ్గురూ పెద్లల సభ సభ్యులుగా ఉన్నారు. మిగతా అందరు మంత్రులు ప్రస్తుతం అసెంబ్లీ బరిలోది గారు. వారందరికీ స్థానాలు కేటాయించబడ్డాయి. అయితే తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నవారిలో చాలామందిపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు గులాబీ బాస్ కు సమాచారం ఉందంటున్నారు. సర్వే ఫలితాల్లో కొందరికి మరీ పూర్ అని వచ్చిందని చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో మంత్రులుగా ఉన్నవారే ఓడిపోతే ప్రతిష్టకు మచ్చ వస్తుందన్న ఉద్దేశంతోనే కేసిఆర్ ముందు సొంత ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఉద్దేశంతో ఈ రకమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.

మరో కారణం కూడా ఉంది. అదేమంటే టిఆర్ఎస్ పార్టీలో అందరూ కేసిఆర్ బొమ్మతోనే గెలవాలన్న ఉద్దేశంలో బాస్ ఉన్నట్లు చెబుతున్నారు. మేము మంత్రులుగా ఉండి జిల్లాలో గెలిపించాము అన్న క్రెడిట్ ఎవరూ కొట్టేయకుండా ఉండేందుకు ఇదొక స్ట్రాటజీ అని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి వారు సొంతంగా గెలవాలి. అలాగే అధినేత కేసిఆర్ ఆశిస్సులతో గెలవాలి తప్ప మధ్యలో మంత్రులు గెలిపించారు. ఇంకొకరు గెలిపించారు అన్న చర్చకు తావు లేకుండా ఉండేందుకు ఈ రకమైన ఆదేశాలు జారీ అయినట్లు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నేత ఒకరు తెలిపారు. 

ఇలా మంత్రులను నియోజకవర్గానికే కట్టడి చేయడం ద్వారా రానున్న ఎన్నికల తర్వాత అసరమైతే మంత్రివర్గంలో అనూహ్యమైన మార్పులు చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. అలా మార్పులు చేర్పులు చేసినా కూడా ఎవరి నుంచి వ్యతిరేకత రాకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేశారేమో అంటున్నారు. పైగా మేమే గెలిపించామని చెప్పడం ద్వారా మంత్రులు ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ అన్న భావన కలిగి తద్వారా రేపు ఒకవేళ ఎవరికైనా మంత్రి పదవి రాకపోతే తిరుగుబాటు లాంటివి చేయకుండా ఉండేందుకు ముందుచూపుతో ఈరకమైన వ్యూహం ఖరారు చేశారని అంటున్నారు. 

ఎన్నికల బరిలోకి దిగిన మంత్రులు వీరే

జోగు రామన్న – ఆదిలాబాద్

ఇంద్రకరణ్ రెడ్డి – నిర్మల్

పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్స్ వాడ

ఈటల రాజేందర్ – హుజూరాబాద్

కేటి రామారావు – సిరిసిల్ల

హరీష్ రావు – సిద్ధిపేట

కేసిఆర్ – గజ్వేల్

పద్మారావు గౌడ్ – సికింద్రాబాద్

తలసాని శ్రీనివాస్ యాదవ్ – సనత్ నగర్

పట్నం మహేందర్ రెడ్డి – తాండూరు

జగదీష్ రెడ్డి – సూర్యాపేట

చందూలాల్ – ములుగు

తుమ్మల నాగేశ్వరరావు – పాలేరు

లక్ష్మారెడ్డి – జడ్చర్ల

జూపల్లి కృష్ణారావు – కొల్లాపూర్ 

పోటీకి దూరంగా ఉన్న మంత్రులు వీరు

కడియం శ్రీహరి – ఎమ్మెల్సీ

మహమూద్ అలీ –  ఎమ్మెల్సీ

నాయిని నర్సింహ్మారెడ్డి – ఎమ్మెల్సీ