కేసిఆర్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర రెండో సిఎం గా కేసిఆర్ గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అన్ని ముహూర్తాలను, జాతకాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేసిఆర్ రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

గురువారం కేసిఆర్ సిఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతోపాటు మిగతా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదంటే కేసిఆర్ ఒక్కరే చేస్తారా అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతున్నది. అయితే తొలుతు కేసిఆర్ తోపాటు మరో ఐదుగురు (1+5 =6 కేసిఆర్ లక్కీ నెంబర్ ఆధారంగా చూస్తే) కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం వెలువడింది. 

కానీ తాజా పరిస్థితులను చూస్తే ఆరుగురు కాకుండా కేసిఆర్ తో పాటు మరో ఒక్కరే (అంటే 1+1 = 2) ప్రమాణ స్వీకారం చేయవచ్చిన చెబుతున్నారు. కేసిఆర్ తో పాటు అయితే దళిత, గిరిజన వర్గాల నుంచి మరో వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయవచ్చని చెబుతున్నారు. అలా కాకపోతే మైనార్టీ ముస్లిం సామాజికవర్గానికి చెందిన వ్యక్తి చేత అయినా ప్రమాణ స్వీకారం చేయించే చాన్స్ ఉందని అంటున్నారు.

కేసిఆర్ గత కేబినెట్ అంతా మహిళలు లేకుండానే నడిపారు. కానీ ఈసారి మహిళలు ఒకరు లేదా ఇద్దరికి అవకాశం దక్కొచ్చని అంటున్నారు. ఈసారి టిఆర్ఎస్ నుంచి ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో గొంగిడి సునీత, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్ గెలిచారు. సామాజిక సమీకరణాల కూర్పులో కూడా వైవిధ్యం ఉండొచ్చని చెబుతున్నారు.

గత కేబినెట్ లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఆరుగురు మంత్రులు ఉన్నారు. వెలమ సామాజికవర్గానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. బిసిలు నలుగురు ఉన్నారు. ఎస్సీ ఒకరు ఉండగా ఎస్టీ ఒకరు ఉన్నారు. మైనార్టీ ఒకరు ఉన్నారు. తెలంగాణ కేబినెట్ లో సిఎం సహా 18 సంఖ్య మించరాదు. దీంతో ఈసారి ఏ ఏ సామాజికవర్గాలకు ఎంత మేరకు ప్రాధాన్యత దక్కబోతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇద్దరు ఎమ్మెల్సీలకు డిప్యూటీ సిఎం పదవులు గతంలో ఇచ్చారు. హోంమంత్రిగా నాయిని నర్సింహ్మారెడ్డి కూడా ఎమ్మెల్సీగా ఉండి మంత్రి అయ్యారు. గతంలో మంత్రులుగా ఉన్న వారిలో నలుగురు ఉన్నారు. తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, చందూలాల్ ఓటమిపాలయ్యారు. వారిలో ఇప్పుడు ఎవరికీ అవకాశం దక్కకపోవచ్చని అంటున్నారు. ఉంటే గింటే ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు మళ్లీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే చాన్స్ ఉందని చెబుతున్నారు. లేదంటే ఖమ్మం జిల్లా కేంద్రంలో గెలిచిన పువ్వాడ అజయ్ కి మంత్రి పదవి కట్టబెట్టే చాన్స్ ఉందని చెబుతున్నారు. 

ఇక ఈసారి కేసిఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే ఆ ఒక్కరు ఎవరు అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉందంటున్నారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీ సభ్యత్వంతో మంత్రులుగా ఉన్నవారిలో కడియం శ్రీహరి, మహమూద్ అలీ ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు. నాయిని నర్సింహ్మారెడ్డి హోంమంత్రిగా ఉన్నారు. వీరిని తదుపరి కేబినెట్ లో కొనసాగిస్తారా? లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది.

గెలిచిన మంత్రుల్లో ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కేటిఆర్,  హరీష్ రావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, అవంచ లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పద్మారావు గౌడ్ ఉన్నారు. వీరందరికీ కేబినెట్ బెర్తులు ఖరారయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వీరితోపాటు కొందరు సీనియర్లకు, మరికొందరు కొత్తగా గెలిచిన వారు కూడా మంత్రివర్గంలో బెర్తులు దక్కవచ్చని చెబుతున్నారు.