కేసీఆర్ తో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న ఆ ఒక్క మంత్రి అతనేనా

తెలంగాణ సీఎంగా రెండోసారి కేసీఆర్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మద్యాహ్నం 1.25 నిమిషాలకు కేసీఆర్ సీఎంగా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముందుగా ఐదుగురు మంత్రులతో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించారు. కానీ సమయం లేనందున కేసీఆర్ తో పాటు మరొకరు మాత్రమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో దఫాలో  మంత్రులను ఎంపిక చేసి ప్రమాణ స్వీకారం చేయించనున్నారని తెలుస్తోంది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కేసీఆర్ సారధ్యంలోని ఆపద్దర్మ మంత్రులు తమ రాజీనామాలను గవర్నర్ కు అందజేశారు. మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ 88 సీట్లతో తెలంగాణలో విజయఢంకా మోగించింది.

ముందుగా కేసీఆర్ ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని అనుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం సీఎంతో పాటు మరొకర క్యాబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. దీంతో మంత్రిగా  ఒకరితో ప్రమాణ స్వీకారం చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు.  సమయం తక్కువగా ఉండటం, వివిధ సామాజిక వర్గాల నుంచి మంత్రి పదవుల పై ఒత్తిడులు వస్తుండడంతో మంత్రి పదవుల ఎంపికి ప్రక్రియ జరగలేదు. దాంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ మరికొంత సమయం తర్వాత మంత్రులను ఎంపిక చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.

ఇప్పుడు తెలంగాణ అంతటా ఒకటే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తో పాటుగా మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేత ఎవరనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కనీసం పార్టీ నాయకులకు కూడా ఈ విషయం పై  క్లారిటి లేదు. కేటిఆర్, హరిష్ రావు కుటుంబ సభ్యులు కావడంతో వారితో చేయించే అవకాశం లేదని తెలుస్తోంది. నాయిని నర్సింహ్మ రెడ్డి, మహమూద్ అలీలకు అసలు మంత్రి వర్గంలో అవకాశం ఉంటుందా అనే అనుమానాలు ఉన్నాయి. దీంతో ఎవరా నేత అని చర్చ నడుస్తోంది.

వనపర్తి నుంచి గెలిచిన నిరంజన్ రెడ్డిని హోంమంత్రిగా తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. అయితే తనతో పాటు నిరంజన్ రెడ్డితోనే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారమోనని కొందరు పార్టీనేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ కు అసలే జాతకాలు, ముహుర్తాల మీద విశ్వాసం ఎక్కువ. ఈ పరిస్థితుల్లో జాతక రీత్యా అదృష్టవంతులుగా ఉన్నవారిచేతనే కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయించే అవకాశం లేకపోలేదు.

ఇటీవల చాలా సభలల్లో కేసీఆర్ మాట్లాడుతూ మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతాం అని ప్రకటించారు. అసదుద్దీన్  ఓవైసితో కేసీఆర్ చర్చించినప్పుడు కూడా జాతీయ వ్యాప్తంగా ఉన్న ముస్లిం జనాభా, వారి సమస్యల పరిష్కారం కోసం చేయాల్సిన  ప్రణాళికల పై మాట్లాడారు. దీంతో ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మహమూద్ అలీతోనే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత మిగిలిన మంత్రులను ఎంపిక చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయిస్తారని చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయేది మహమూద్ అలినే అని ఖాయమైందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.