నిజామాబాద్ ఎంపీ బరిలో 185 మంది… ఎంపీ ఎన్నిక ఆలస్యం అయ్యే ఛాన్స్

తెలంగాణలో నామినేషన్ల ఉపసంహారణ గడువు ముగిసింది. అయితే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మాత్రం ప్రధాన నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఏకంగా 185 మంది బరిలో ఉన్నారు. వీరిలో 178 మంది రైతులే. గురువారం కేవలం నలుగురు రైతులు మాత్రమే నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈవీఎంలతో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికలు జరగడం కష్టంగానే ఉంది. ఈ పార్లమెంటు స్థానానికి బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

ఎందుకంటే ఈవీఎం ల పై 185 మంది కి సంబంధించిన గుర్తులు పట్టవు. అదే విధంగా నిజామాబాద్ ఎన్నిక వాయిదా పడి నెల రోజుల ఆలస్యంగా కూడా జరగవచ్చని తెలుస్తోంది. ప్రింటింగ్ వాళ్లు సమయంలోగా పేపర్లు ముద్రిస్తే ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహిస్తామని లేకపోతే నెలరోజులు ఆలస్యంగా ఎన్నికలు జరుపుతామని ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్దుల్లో ఉత్కంఠ నెలకొంది. టిఆర్ఎస్ నుంచి కవిత, కాంగ్రెస్ నుంచి మధు యాష్కి, బిజెపి నుంచి సంజయ్ బరిలో ఉన్నారు. అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే టెన్షన్ లో వారున్నారు. 

Image result for nizamabad formers

నిజామాబాద్ లో పసుప, ఎర్రజొన్న రైతుల సమస్యలు అనేకంగా ఉన్నాయి. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని గతంలో ఎంపీ కవిత హామీనిచ్చారు. మద్దతు ధర కూడా ఇప్పిస్తానని అన్నారు. కానీ అవేమి చేయకపోవడంతో తమ సమస్య దేశ వ్యాప్తంగా తెలియాలని రైతులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గతంలో కూడా ఫ్లోరైడ్ సమస్యకు సంబంధించి నల్లగొండ నియోజకవర్గంలో వందలాది మంది నామినేషన్లు దాఖలు చేశారు.  దీంతో అధికారులు నెల రోజులు ఆలస్యంగా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. చివరికి సిపిఐకి చెందిన ధర్మభిక్షం గెలిచారు. మరి నిజామాబాద్ లో ఏం జరుగుతుందో చూడాలి.  ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగి మే 23న ఫలితాలు రావాల్సి ఉంది. కానీ నిజామాబాద్ లో సమయానికి జరుగుతాయా లేక ఆలస్యమవుతుందా అనేది తేలాల్సి ఉంది.