Dharmapuri Arvind: కవిత రాజీనామా వెనుక రేవంత్ కుట్ర: వారిద్దరూ బిజినెస్ భాగస్వాములే – ఎంపీ అర్వింద్ ఆరోపణలు

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే కవిత నడుస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కవిత చేపట్టిన ‘జనం బాట’ యాత్రపై ఆయన తీవ్రంగా స్పందించారు. కవిత, రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్‌నర్లు అని, ఆమెతో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని అర్వింద్ ఆరోపించారు.

“అసలు కవిత ఎవరు? జాగృతి ఏంటి?” అని ప్రశ్నించిన అర్వింద్, కవిత ‘జనం బాట’ యాత్ర తీహార్ జైలుకు దారితీస్తుందని, మూడు నాలుగేళ్లలో ఆమె ఆశయం నెరవేరుతుందని ఎద్దేవా చేశారు. గతంలో కాంట్రాక్టర్లు ఆమె వేధింపులకు భయపడి పారిపోయారని ఆరోపించారు.

అణగారిన వర్గాల విద్యార్థులు ఎదగకూడదనే కుటిల ఆలోచనతోనే కల్వకుంట్ల కుటుంబం బీసీ, ఎస్సీ, ఎస్టీల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆపిందని అర్వింద్ విమర్శించారు. ఒక తరాన్ని మొత్తం అణగదొక్కిన చరిత్ర వారిదని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని బీజేపీ తరఫున మండలి ఛైర్మన్‌కు లేఖ రాస్తున్నట్లు ఎంపీ అరవింద్ తెలిపారు. “రేవంత్ రెడ్డికి, కవితకు మధ్య ములాఖత్ ఏంటి? ఆమె రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

మరోవైపు, ఎమ్మెల్సీ కవిత ‘జనం బాట’ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టారు. తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచే ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర దాదాపు నాలుగు నెలల పాటు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది. ఈ పర్యటనలో తన తండ్రి కేసీఆర్ ఫొటో లేకుండా, కేవలం ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతోనే ఆమె ప్రజల్లోకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఒక్కరికి హాని జరగనివ్వం..| Kakinada MP Tangella Uday Srinivas About Cyclone Montha | Telugu Rajyam