టిడిపి అవిశ్వాసం తీర్మానం, కెసిఆర్ ది ఏ దారి ?

తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడి అవిశ్వాసం రాజకీయం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఝలక్ ఇచ్చే వ్యూహం.  తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఆవిశ్వాసం తీర్మానం చర్చకు రాబోతున్నది. తేదీకూడా ఖరారయింది. దీని మీద చర్చ తర్వాత వొటింగ్ జరుగుతుంది. అపుడు టిఆర్ ఎస్ ఎంపిలు లోక్ సభలో  తీర్మానం మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మోదీ నాయకత్వంలోని ఎన్డీయేప్రభుత్వానికి వోటేయడమా లేక తమకే మాత్రం నచ్చని చంద్రబాబు నాయుడి తెలుగుదేశం తీర్మానానికి మద్దతు నీయడమా అనే ప్రశ్న ఎదురువుతంది.

ఇంతవరకు కెసిఆర్ మోదీని నొప్పించకుండా వస్తున్నారు.  అపుడపుడు నోరు జారినా, వెంటనే గొప్పగా సవరించుకుని, మోదీ నా బెస్ట్ ఫ్రండ్ అని కూడా అనగలిగారు. నోరు జారిని విషయం రాసిన మీడియా వాళ్లని ఏకిపడేశారు. తిట్టడంలో కెసిఆర్ నాలుక కొరడాయే.  రాష్ట్రంలో ఎంఐఎంతో పొత్తు ఉన్నా కేంద్రంలో మోదీ తో సఖ్యంగా ఉంటున్నారు. అడపదడపా ప్రెస్ వాళ్ల కోసమని తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదంటున్నా లోలోన టిఆర్ ఎస్ ప్రభుత్వం మోదీతో చనువుగానే కొనసాగుతున్నది.

హైదరాబాద్ వచ్చినపుడల్లా టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా గిల్లు కుంటూ వచ్చిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మొన్న పర్యటనలో టిఆర్ ఎస్ వూసెత్త లేదు. దీనితో టిఆర్ ఎస్, బిజెపి దగ్గరవుతున్నాయనే అనుమానాలు సర్వత్రా వచ్చాయి. కలసి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, ఎన్నికల తర్వాత మోదీకి మద్దతు తెలిపి ఎన్డీయే ప్రభుత్వంలో చేరిపోయే అవకాశం మెండుగా ఉంది. ఇది ఎపుడో జరగాల్సి ఉండింది.  2019 లోపే మంత్రి పదవులొస్తాయని కనీసం ముగ్గురు నలుగురు టిఆర్ ఎస్ ఎంపిలు ఆశపడ్తువచ్చారు. అదీ టిఆర్ ఎస్, బిజెపి అనుబంధం. ఇదంతా ఇంతవరకు అదృశ్యంగా ఉండింది. ఇలాంటపుడు మోదీ ప్రభుత్వం మీద ఆవిశ్వాసం పెడ్తున్నట్లు టిడిపి ఎంపి సుజనా చౌదరి వచ్చి టిఆర్ ఎస్ రాజ్య సభ సభ్యుడు కె కేశవరావుతో చెప్పారు. ఆ విషయం పార్టీ తేలుస్తారని కేశవరావు తనపరిధిలోనే  చెప్పారు.

టిడిపి పెట్టే ఆవిశ్వాసానికి ఎవరూ మద్దతు నీయరు, అసలది స్పీకర్ అనుమతి పొందదని టిఆర్ ఎస్ వాళ్లు అనుకున్నారు. కాబట్టి, ఎలాంటి  గొడవ ఉండదని భావిస్తూ వచ్చిన  టిఆర్ ఎస్ కు ఇపుడు చిక్కొచ్చిపడింది. ఆవిశ్వాసం తీర్మానం సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ సుమిత్రామహాజన్ అనుమతినిచ్చారు. బుధవారం ఉదయం తెలుగుదేశం సభ్యులు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, తోట నర్సింహం, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన నోటీసులుఇచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని చదివి వినిపించారు. దీనికి కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ పార్టీలుమద్దతు తెలిపాయి. ఈ అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్‌  ఎంపీలు మద్దతు తెలపలేదు. పార్టీ అధినేత కేసీఆర్ నుంచి  తమకు ఆదేశాలు అందలేదని  ఎంపీలు చెబుతున్నారు. టిఆర్ ఎస్ మిత్రపార్టీ ఎంఐఎం  ఎంపి అసదుద్దీన్ ఓవైసీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు.

అవిశ్వాస తీర్మానం వచ్చే శుక్రవారం చర్చకువస్తున్నది . ఈ రోజు అవిశ్వాస తీర్మానం మీద నిర్ణయం తీసుకొనకపోయినా ఆ రోజు  కచ్చితంగా టిఆర్ ఎస్ బిజెపి వైపా, ప్రతిపక్షం వైపా చెప్పాల్సి వస్తుంది.  కెసిఆర్ ముందర ఇపుడు మూడు మార్గాలున్నాయి. 1. నేను కాంగ్రెస్ వ్యతిరేక బిజెపి వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్  పెట్టాలనుకుంటున్నాను కాబట్టి, మోదీకి మద్దతు ఇవ్వలేను, కాంగ్రెస్ సపోర్టు చేయలేనని వోటింగ్ ను బహిష్కరించడం 2. ఆంధ్రపదేశ్ విభజన చట్టంలో ఉన్న ఆంశాల ప్రకారం తెలంగాణకు రావలసినవి చాలా ఇవ్వలేదని చెప్పి నిరసనగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంతా వోటేయాలి. 3. మోదీ చక్కగా దేశాన్ని పరిపాలిస్తున్నారు. డీమానెటైజేషన్ ను సమర్థించాం. జిఎస్ టిని సమర్థించాం. జమిలి ఎన్నికల ప్రతిపాదన లో కూడా మోదీకి మద్దతునిచ్చాం. మాకు మోదీకి పేచీలేదని, ఆవిశ్వాస తీర్మానికి  వ్యతిరేకించాలి.

అపుడుగాని కెసిఆర్ జాతీయ రాజకీయమా లేక రాజీకీయం అనేది అర్థం కాదు.