హైదరాబాద్ ఎక్కడ? తెలంగాణ టాప్ 10 లో లేదు

 

తెలంగాణ ప్రభుత్వమేమో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అనో, టి-హబ్ అనో చెప్పుకుంటుంది.  పురజనులనడగండి, హైదరాబాద్ అంటే,గతుకుల రోడ్డు, చెత్తా చెదారం, వాన వస్తే మునిగిపోయే రోడ్లు, పుట్ పాత్ లసలే లేకపోవడం… ఇలా లక్ష సమస్యలు చెబుతారు. ఒక్క మాటలో చెబితే, హైదరబాద్ హ్యాపీగా బతికేందుకు పనికొచ్చే నగరం లాగా కనిపించదు. అసలిదే విషయాన్ని కేంద్రం కూడా ధృవీకరించింది.

దేశంలో నివాసయోగ్యమయిన(లివబుల్ )సిటీలలో హైదరాబాద్ వెనకబడిపోయింది. టాప్ పది నగరాలలో తెలంగాణకు తలమాణికమయిన  హైదరాబాద్ లేదు.  అయితే,పదకొండో స్థానంలో కరీంనగర్ ఉంది.  హైదరాబాాద్ ఎక్కడో 27 వ స్థానంలో కూలబడింది. ఇపుడయినా పాలకులు గొప్పలు చెప్పకుండా హైదరాబాద్ నిజస్వరూపం  ఎలా ఉందో తెలుసుకోవాలి. ఒక పక్క హైదరాబాదే కాదు, హైదరాబాద్ అన్ని వైపుల నుంచి, అన్ని కోణాలనుంచి గర్వపడేదిగా ఉండాలి.

అయితే, ఈ విషయంలో   తెలంగాణ ఒంటరికాదులే. తమిళనాడుకు కూడా మొదటి పది ర్యాంకులలో చోటు దక్కలేదు.

నగర పరిపాలన, సాంఘిక మౌలిక వసతులు, ఇతర మౌలికవసతులు అధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. అంటే, హైదరాబాద్ నగరపాలన  ఏమంత గర్వపడేది గా లేదని స్పష్టమవుతుంది.

కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ‘ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ’ ప్రకారం పుణే,నవి ముంబాయ్,  గ్రేటర్ ముంబయి నగరాలు టాప్ లో ఉన్నమూడునగరాలు.  తమాషా ఏమిటంటే జాతీయ రాజధాని న్యూఢిల్లీ 65వస్థానంలో ఉంది.  

టాప్ టెన్ మోస్ట్ లివబుల్ (నివాసయోగ్యమయిన) నగరాలో ఆంధ్రప్రదేశ్ చెందిన తిరుపతికి, విజయవాడకు చోటు దక్కింది.

 పుణే, నవి ముంబయ్, గ్రేటర్ ముంబయ్ తర్వాతి స్థానాలు తిరుపతి, చండీగడ్, ధానే, రాయ్పూర్, ఇండోర్ విజయవాడ, భోపాల్.

నగరాలకు నివాసయోగ్యత మీద ర్యాంకింగ్ ప్రపంచంలో ఇదే మొదటి సారి. ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ పాతాళంలో ఉంది. మన సినిమా యాక్టర్  జయప్రద అక్కడి నుంచి ఒక దఫా లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు.

 

(feature photo from @sanjayborra )