శ్రీశైలం ఫారెస్ట్ ఆఫీస్ వద్ద మంగళవారం రాత్రి ఒక ఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించిన ఐదుగురు వ్యక్తులు అటవీ కార్యాలయం వద్ద ఇష్టానుసారం రెచ్చిపోయారు. రోడ్డుపై మద్యం సేవిస్తూ, గట్టి గట్టిగా అరుస్తూ, డ్యాన్సులు వేస్తూ వాహన చోదకులకు అంతరాయం కలిగిస్తూ ఆగడాలకు పాల్పడ్డారు.
వారి వీరంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అటవీశాఖ అధికారిపై దాడికి దిగారు. నువ్వు పోలీసువేనా అంటూ ఎదురు ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ కి వెళితే నేనెవరో తెలుస్తుంది. నీ అంతు చూస్తా అంటూ ఒక వ్యక్తి అధికారిపై రుబాబు చేశాడు.
మద్యం సేవించి హల్ చల్ చేసిన ఐదుగురు వ్యక్తులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారుగా తెలుస్తోంది. వారిలో ఒక వ్యక్తి తెలంగాణ ఎమ్మెల్సీ కొడుకునంటూ, నేనెవరో తేలుస్తా అంటూ బెదిరింపుకు పాల్పడ్డాడు. సెక్షన్ ఆఫీసర్ సాగర్ పై దాడి చేశాడు. పోలీసు అధికారిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా గన్ తో కాలుస్తామంటూ హెచ్చరించారు.
అధికారి ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా తమ కళ్ళు పట్టుకుంటే కానీ విడిచి పెట్టమని హెచ్చరించారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యను వీడియో తీశారు. ఈ సంఘటనని సెక్షన్ ఆఫీసర్ ఇతర సిబ్బందికి, తన పైఅధికారులకు తెలపగా వారు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. వీరంగం సృష్టించిన మందుబాబులను అదుపులోకి తీసుకుని శ్రీశైలం టూటౌన్ లో వారిపై కేసు నమోదు చేశారు.