తన ఓటమి పై కాంగ్రెస్ జానారెడ్డి స్పందన ఇదే

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్ లో ప్రత్యర్థి నోముల నర్సింహ్మయ్య చేతిలో ఓటమి పాలయ్యరు.  చిన్నచిన్న పొరపాట్ల వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమన్నారు. ప్రజా తీర్పును అందరూ గౌరవించాల్సిందే అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జానారెడ్డి గాంధీ భవన్ లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

“రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ గమనంలో ఉంచుకొని ముందుకు పోవాలి. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కేసీఆర్ కి ధన్యవాదాలు. ఎన్నికల నిర్వహణలో చాలా పొరపాట్లు జరిగాయి.

ఓట్ల గల్లంతు, ఓట్ల తీసివేత, ఓట్ల చేర్పులో చాలా అవకతవకలు జరిగాయి. ఈ విషయంలో వెంటనే ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలి.  ఈవీఎంలలో కూడా చాలా పొరబాట్లు జరిగాయి. పోలైన  ఓట్లకు, వీవీ ప్యాట్ లో వచ్చిన ఓట్లకు తేడా ఉంది. దీని పై ఎన్నికల సంఘం విచారణ చేయాలి.

నాగార్జున సాగర్ లో నేను గెలవాలని రాత్రింబవళ్లు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు, అభిమానులకు నేను ధన్యవాదాలు తెలపుతున్నాను. విజయం చేకూరనంత మాత్రాన కుంగి పోవాల్సిన అవసరం లేదు. నా పై విజయాన్ని సాధించిన నోముల నర్సింహ్మయ్యకు అభినందనలు తెలుపుతున్నాను. ప్రజాస్వామ్యంలో విజయం సాధించిన వారిని గౌరవించడం బాధ్యత కాబట్టి నేను నా బాద్యతగా శుభాకాంక్షలు చెబుతున్నాను.

తెలంగాణలో పటిష్టమైన కాంగ్రెస్ నాయకత్వం తయారు కావాల్సి ఉంది.  యువత అధికంగా తోడ్పాటు అందించాలి.  వివిధ కారణాలతో తాము ఓడిపోయాం. అందరి నాయకులతో విశ్లేషణ చేసిన తర్వాత ఓటమికి గల కారణాలు చెబుతాను. ఈ దేశ అవసరాల దృష్ట్యా కూటమి ఏర్పాటు చేశాం. భవిష్యత్తు కోసమే కలిసి పని చేశాం. కూటమి కట్టడంతోనే ఓడిపోయామనేది వాస్తవం కాదు. చంద్రబాబు రావడం వల్లనే ఇలా జరిగిందని అనడం సరైంది కాదు.

నేను విశ్రాంతి తీసుకుంటానో లేదో తెలియదు. నేను విశ్రాంతి తీసుకున్నా తీసుకోకపోయినా పని చేస్తాను. నేను విశ్రాంతి తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తాను. నేను విశ్రాంతి తీసుకుంటానా లేదా అనే దాని పై ఇప్పుడే మాట్లాడలేను.”

త్వరలోనే పార్టీలో చర్చించిన తర్వాత మరిన్ని వివరాలు చెబుతాను అని జానారెడ్డి అన్నారు.