తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తప్పిన వారిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. గీత దాటిన నేతలపై వేటుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే అధిష్టానం దూతపై అవినీతి ఆరోపణలు గుప్పించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేష్ మీద వేటుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముందుగా ఫార్మాలిటీ ప్రకారం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. ఆయన ఇచ్చే రిప్లై ని బట్టి ఆయన మీద వేటు నిర్ణయం తీసుకునే చాన్సెస్ ఉంటాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
క్యామ మల్లేష్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్రహింపట్నం సీటును ఆశించారు. డిసిసి ప్రసిడెంట్ గా ఉన్న తనకు సీటు పక్కా అనుకున్నారు. పైగా తాను బిసి సామాజికవర్గానికి చెందిన యాదవ (కురుమ) కులస్తుడిని కావడంతో సీటు వస్తుందనుకున్నారు. కానీ ఆ సీటు పొత్తులో భాగంగా టిడిపికి పోయింది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం వారికే ఎక్కువ సీట్లు ఇచ్చారన్న విమర్శలు గుప్పించారు క్యామ మల్లేష్.

దాంతోపాటు కాంగ్రెస్ స్ర్రీనింగ్ కమిటీ నేత భక్త చరణ్ దాస్ మీద సంచలన ఆరోపణలు చేశారు క్యామ మల్లేష్. టికెట్ కోసం మూడు కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తూ ఆడియో టేపులను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్మకునే కల్చర్ ఈ ఎన్నికల్లో కూడా కొనసాగిందంటూ విమర్శలు గుప్పించారు.
అయితే ఆ ఆడియో టేపులో భక్త చరణ్ దాస్ కొడుకు మాట్లాడినట్లు ఆధారాలు లేవు. ఇద్దరు మధ్యవర్తులు మాట్లాడుకున్న టేపులను వెలువరించారని, క్యామ మల్లేష్ చర్య వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరిందన్న ఉద్దేశంతో ఆయన మీద వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు గాంధీభవన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇక తనకు టికెట్ రాకపోవడంతో క్యామ మల్లేష్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తనతోపాటు సీటు రాని యాదవ ముఖ్య నేతలు భిక్షపతి యాదవ్, తోటకూర జంగయ్య యాదవ్ తదితరులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీగా మారిపోయిందని, యాదవులకు సీట్లు ఇవ్వకుండా దారుణంగా అవమానించారని మండిపడ్డారు.
అంతేకాకుండా ఖైరతాబాద్ సీటును అమ్ముకున్నారని, దానం నాగేందర్ వద్ద 10 కోట్లు తీసుకుని ఖైరతాబాద్ సీటు అమ్ముకున్నారని విమర్శించారు. క్యామ మల్లేష్ విమర్శలపై అధిష్టానం వివరణ కోరింది. అయితే ఆయన తన వైఖరిలో మార్పు వస్తుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆయన సరైన రిప్లై ఇవ్వకపోతే ఆయన మీద వేటు పడే చాన్సెస్ ఉంటాయని చెబెతుున్నారు.
కోమటిరెడ్డికి ఒక రూలు, క్యామ మల్లేష్ కు ఒక రూలా?
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏ నాయకుడిని ఏ నాయకుడైనా తిట్టుకోవచ్చు. ఎంత తిట్టుకున్నా సరే వారి మీద పెద్దగా చర్యలు ఉండవు. మొన్నటికి మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎఐసిసి ఇన్ఛార్జి కుంతియాను అడ్డం నిలువు కడిగి పారేశారు. ఏడ నుంచి వచ్చినవురా కుంతియా అంటూ వాడు, వీడు భాషలో కుమ్మి పారేశారు. తెలంగాణ పట్ల కుంతియా శనిలా దాపురించిండు అని మండిపడ్డారు.
అలాగే గాంధీభవన్ లో తిరిగే బ్రోకర్ నా కొడుకులకు పదవులు ఇస్తున్నారని, టివిల ముందు మాట్లాడే వారికే కమిటీల్లో చోటు కల్పిస్తున్నారని తీవ్రమైన భాషలో మండిపడ్డారు. ఆ సమయంలో కుంతియా ను తిట్టినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఆయన రిప్లై ఇచ్చినా సరైన వివరణ రాలేదని మరో నోటీసు జారీ చేశారు. కానీ రెండో దానికి కోమటిరెడ్డి రిప్లై ఇవ్వలేదు. మరి ఆ కేసు ఏమైందో ఏమో క్లోజ్ చేశారా? పెండింగ్ లో పెట్టారా తేలలేదు.
మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు మాత్రమే ఇచ్చి కేసు క్లోజ్ చేశారు. క్యామ మల్లేష్ మీద చర్యలకు దిగుతున్నట్లు కనబడుతున్నది. అయితే క్యామ మల్లేష్ పార్టీ మారే చాన్సెస్ ఉన్నట్లు కాంగ్రెస్ నాయకత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆయన మీద వేటు వేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఒక రూలు, బిసి నాయకులకు ఒక రూలా? ఇదేం పద్ధతి అని క్యామ మల్లేష్ సన్నిహితుడు ఒకరు ప్రశ్నించారు.