కేసీఆర్ సూపర్ ఐడియా : ఢిల్లీ ఆజాద్ మార్కెట్ తరహాలో హైదరాబాద్ లో కూడా మార్కెట్ నిర్మాణం

cm kcr file photo

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగులో గణాత్మకమైన మార్పు తీసుకురావడానికి సమగ్ర ఉద్యానవన పంటల విధానాన్ని త‌యారు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఉద్యాన‌వ‌నశాఖ అధికారుల‌ను ఆదేశించారు. మూడు నెలల్లోగా దీన్ని రూపొందించాలని అన్నారు. ఏడాదిలోగా ఉద్యాన పంటల సాగులో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నో సానుకూలతలు ఉన్నప్పటికీ పండ్లు, కూరగాయలు, పూలు, మసాల దినుసులు, నూనె గింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితి మారాల‌ని తెలిపారు. ఉద్యానవన పంటల్లో తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాల‌ని అభిప్రాయపడ్డారు.

cm kcr file photo
cm kcr file photo

మన అవసరాలు తీర్చడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసే విధంగా మనం ఎదగాల‌ని.. ఇందుకోసం ఉద్యానవనశాఖ సమాయత్తం కావాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఉద్యాన‌వ‌న‌శాఖ అధికారుల‌కు శిక్షణ అవ‌స‌రమన్న సీఎం కేసీఆర్.. ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లి అక్కడి సాగు పద్ధతులు, అనుభవాలు, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాల‌ని సూచించారు. ఉద్యానవనశాఖ అధికారులను బెంగులూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ కు పంపి శిక్షణ ఇప్పించాల‌న్నారు. అక్కడి నుంచి నిపుణులను తెలంగాణకు ఆహ్వానించి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు.

హార్టికల్చర్ యూనివర్సిటీలో, ఉద్యానవన శాఖలో తోటలపై పరిశోధనలు విస్తృతంగా జరపాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఉద్యాన‌వ‌న‌శాఖ‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ఉద్యానవనశాఖలో కూడా సాగు విధానంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడానికి, మార్కెటింగ్ పై నిరంతరం సమాచారం తెలుసుకోవడానికి, పంటల్లో నాణ్యత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి సీనియర్ అధికారుల నాయకత్వంలో ప్రత్యేక విభాగాలు ఉండాలని సూచించారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏది అవసరమో గుర్తించి వాటిని రైతులతో సాగు చేయించాల‌న్నారు. ఢిల్లీ ఆజాద్ పండ్ల‌ మార్కెట్ తరహాలో హైదరాబాద్ కొంగరకలాన్ ప్రాంతంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటల మార్కెట్‌ను నెలకొల్పబోతున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.