ఆ ఊరిలో దేవునికే అవమానం.. రాజకీయం కోసం ఏండ్ల నాటి ఆచారాన్ని ఆగం చేశారు

ఆ దేవాలయానికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. కానీ రాజకీయాల రందిన పడి ఆ దేవాలయంలో దేవుడికి పల్లకి మోసే పరిస్థితి లేదు. వేల జనాభా ఉన్న స్వామి వారి పల్లకి మోసేందుకు ఒక్కరు ముందుకు రాలేదు. పాపం ఆ దేవునికే కష్టాలు వచ్చాయి. దేవుని పల్లకి మోసే అదృష్టం రావడమే గొప్పగా భావిస్తారు. కానీ ఆ ఊరిలో ఒక్కరికి కూడా దేవుని పల్లకి మోసేందుకు చేతులు రాలేదు.ఇది ఎక్కడి హత విధి దేవుడా అనుకుంటూ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంత జరిగినా ఆ ఊరి పెద్దల్లో మాత్రం మార్పు లేదు.అసలు ఇది ఎక్కడా దీని కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామం. ఈ ఊరిలో వందల ఏళ్ల క్రితం శ్రీ కృష్ణుడు వెలిసాడు. ఆయన పేరు మీదుగానే ఆ ఊరికి కిష్టాపురం అనే పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.  ఈ జాతర కోసం చుట్టు పక్కల గ్రామాల్లోని స్కూళ్లకు సెలవులు కూడా ఇస్తారు. అంతటి ప్రాధాన్యత ఈ గ్రామానికి ఉంది. 

ప్రతి సంవత్సరం జాతర జరిగే ముందు ఒక్క వ్యక్తిని గుడి చైర్మన్ గా ఎన్నుకుంటారు. అతనే మరో సంవత్సరం ఉత్సవాలు జరిగేంత వరకు బాధ్యునిగా ఉంటాడు. అయితే ఈ సారి గ్రామంలో టిఆర్ ఎస్ కు చెందిన వ్యక్తి చైర్మన్ గా ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. రాజకీయ విబేదాలతోనే ఎలాగో అలా దేవుని బ్రహ్మోత్సవాలు జరిపారు. కానీ గ్రామంలో దేవుని కళ్యాణం జరిగిన తర్వాత దేవుని పల్లకిని ఊరేగిస్తారు. కానీ ఈ సారి పల్లకి ఊరేగింపు జరగలేదు. చైర్మన్ తీయాలని సర్పంచ్, సర్పంచే తీయాలని చైర్మన్ పోటి పడి చివరికి గ్రామంలో దేవుని పల్లకి ఊరేగింపు జరగలేదు. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

వాస్తవానికి గుడి చైర్మన్ బాధ్యతతో పల్లకి ఊరేగింపు కూడా జరపాలి. కానీ ఈ సారి అలా జరపలేదు. గుడి బ్రహ్మోత్సవాలకు రాజకీయాలకు సంబంధమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరైనా పల్లకి మోద్దామని ముందుకు వచ్చినా రాజకీయ నాయకుల నుంచి ఏమైనా ఇబ్బంది వస్తుందా అని బయపడినట్టు తెలుస్తోంది. మరి కొంత మంది ముసలి వాళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏండ్ల కాలం నాటి నుంచి వస్తున్న ఆచారాన్ని తప్పించారు. గ్రామానికి ఏమైనా జరుగుతుందా అని వారు భయపడుతున్నారు. దేవుడా కొందరి తీరు వల్ల అన్యాయం జరిగిందని దయచేసి క్షమించు స్వామి అంటూ మరికొంత మంది వేడుకుంటున్నారు. మరి దీని పై గ్రామ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.