YSRCP : మళ్ళీ వైసీపీదే గెలుపు.. కండిషన్స్ అప్లయ్.!

YSRCP : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులుంటాయ్.? ఎవరు గెలుస్తారు.? అధికార వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి.? విపక్షాలు ఏ మేర సత్తా చాటగలుగుతాయి.? ఈ అంశాలపై కొన్ని ‘జాతీయ సర్వేలు’ ఆసక్తికరమైన ఫలితాల్ని వెల్లడించాయి.

అసలు ఇలాంటి సర్వేలు ఎందుకు జరుగుతాయి.? ఆ సర్వేల ఫలితాల్లో వాస్తవాలెంత.? అన్నది వేరే చర్చ. వాటిని పెయిడ్ సర్వేలుగా చాలామంది అభివర్ణిస్తుంటారు. గతంలో ఇదే ఆరోపణ వైసీపీ కూడా కొన్ని సర్వేల విషయంలో చేసింది. కానీ, ఇప్పుడు ఆ సర్వేల్ని పట్టుకుని, ‘జరగబోతోంది ఇదే..’ అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది, విపక్షాలని ఎద్దేవా చేస్తోంది.

నిజమే, రాష్ట్రంలో వైసీపీకి ప్రస్తుతానికైతే ఎదురే లేదు. విపక్షాల్లో బలమైన నాయకత్వం కొరవడింది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలాపడిపోయింది. జనసేన పార్టీకి కార్యకర్తల బలం వున్నా, నాయకత్వం అత్యంత బలహీనంగా వుంది. నియోజకవర్గాల స్థాయిలో జనసేనకు సరైన నాయకులే లేరు.

సో, ఎలా చూసినా.. వైసీపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, బంపర్ విక్టరీ సాధించడం ఖాయమే. అయితే, పూర్తిగా ఈ సర్వేల్ని, తాజా పరిస్థితుల్నీ నమ్మేయలేం. రాజకీయాల్లో ఎప్పుడు ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయో ఊహించడం అంత తేలిక కాదు. ఓ చిన్న సంఘటన, మొత్తంగా రాజకీయ సమీకరణాన్ని మార్చేస్తుంటుంది.

తెలుగుదేశం పార్టీ చాపకింద నీరులా బలపడుతోంది. జనసేన పార్టీ కూడా అంతే. బీజేపీ, కాంగ్రెస్ గురించి అయితే రాష్ట్రంలో ఆలోచించాల్సిన అవసరమే లేదు. టీడీపీ – జనసేన – బీజేపీ కలిస్తే మాత్రం ఫలితాలు ఇంకోలా వుంటాయి. అవి ఖచ్చితంగా వైసీపీని దెబ్బకొట్టేలా వుండొచ్చు.

అన్నిటికీ మించి, వైసీపీలోనే అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయాయ్. అవి వైసీపీని ఏ క్షణమైనా నిర్వీర్యం చేసే ప్రమాదం లేకపోలేదు.