Ys Sharmila : వైఎస్ షర్మిల పార్టీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్.!

Ys Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. అంటూ తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన షర్మిలకు, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల షాక్ తగిలిన విషయం విదితమే. పార్టీ పేరు విషయమై అభ్యంతరాలు రావడంతో, ఆ పార్టీ గుర్తింపు వ్యవహారం అయోమయంలో పడింది. ఎట్టకేలకు ఇబ్బందులు తొలగిపోయాయ్.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

పార్టీ గుర్తింపు అయోమయంలో పడటంతో వైఎస్ షర్మిల తన పాదయాత్రను కొన్నాళ్ళపాటు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఏ పేరుతో జనంలోకి వెళ్ళాలో తెలియక వైఎస్సార్టీపీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు కూడా గందరగోళంలో పడిపోయారు. ఎలాగైతేనేం, పార్టీ గుర్తింపు విషయమై స్పష్టత రావడంతో వైఎస్సార్టీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

కాగా, అతి త్వరలో షర్మిల తన పాదయాత్రను తిరిగి ప్రారంభించబోతున్నారట. ఇంకోపక్క, తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలకు వైఎస్సార్టీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ గుర్తింపు విషయమై గందరగోళం కొనసాగుతున్నప్పుడూ వైఎస్ షర్మిల, రాజకీయంగా యాక్టివ్‌గానే వుంటూ వచ్చారు. వీలు చిక్కినప్పడల్లా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మీద విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కేసీయార్ ఫెయిల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోందనీ, జాతీయ రాజకీయాల్లో ఆయనేం సాధిస్తారంటూ తాజాగా షర్మిల ఎద్దేవా చేసిన విషయం విదితమే.