ఎన్నో అంచనాలతో ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఇది కూడ వాలంటీర్ వ్యవస్థ మాదిరి ప్రజల మన్ననలు పొందుతుందని ఆశపడ్డారు. సుమారు 9000కి పైగా డోర్ డెలివరీ వాహనాలను కొనుగోలుచేసి ఇంటింటికీ సరుకులు అందజేసే పని మొదలుపెట్టారు. అయితే ఈ కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు అన్నట్టు వరుస ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇకపై రేషన్ షాపుల ముందు క్యూ కట్టనక్కరట్లేదని నేరుగా రేషన్ ఇంటికి ముందుకువచ్చి ఆగుతుందని అన్నారు. జనం సైతం ఇళ్ళలో కూర్చుంటే రేషన్ వచ్చేస్తుందని ఆశపడ్డారు. జగన్ అన్నట్టే వాహనాలు రేషన్ నింపుకుని బయలుదేరాయి. కానీ ఇంటి ముందుకొచ్చి ఆగట్లేదు. సందు చివరకొచ్చి ఆగుతున్నాయి. రేషన్ షాపుల ముందు క్యూ కట్టినట్టే అక్కడ కూడ జనం క్యూలో నిల్చోవాల్సి వస్తోంది.
దీంతో అసలు పథకం ప్రధాన స్ఫూర్తే మంటగలిసినట్టయింది. జనం రేషన్ షాఫుల్ ముందూ క్యూలోనే ఇక్కడా క్యూలోనే తేడా ఏముంది. అక్కడ షాపు ఇక్కడ వాహనం అంతే తేడా అంటున్నారు. 1800 మందికి ఒక వాహనం అన్నట్టు లెక్క తేల్చారు. ఇక్కడే వాహన డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. పని కాస్త చాకిరీగా మారిపోయింది. లోడింగ్ అండ్ లోడింగ్, తూకం వేయడం, పంపిణీ చేయడం అన్నీ వాహనదారులే చూసుకోవాలి. ఇంతా చేస్తే వచ్చేది 16000. అందులోనే వాహనం వాయిదా కట్టుకోవాలి. హెల్పర్ ను పెట్టుకుంటే బేటా ఇవ్వాలి. అన్నీ ఇక డీజిల్ ఖర్చు కూడ వారిదే. అన్నీ పోను నెలకు 7000 మాత్రమే మిగులుతుందని అంచనా. ఇక కష్టం చూసే బండెడు చాకీరీ ఉంటోంది.
మొదటి రెండు మూడు రోజుల్లోనే ఈ సంగతి తెలిసొచ్చింది వాహనదారులకు. దీంతో ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసి పంపిణీ ఆపేశారు. అధికారులు కలుగజేసుకుని బుజ్జగించే ప్రయత్నం చేసినా మెత్తబడేలా లేరు. దీంతో రేషన్ సకాలంలో అందక పేదలు ఇబ్బందిపడుతున్నారు. అచ్చంగా రేషన్ సరుకుల మీదనే ఆధారపడి జీవితం వెళ్లదీసేవారు ఉన్నారు. అదే సమయానికి అందకపోతే పస్తులే. రేషన్ షాపులో రేషన్ ఇస్తున్నప్పుడు ఈ కష్టం ఉండేది కాదు. కాస్త శ్రమపడినా సకాలంలో రేషన్ అందేది. ఒకవేళ ఈ ఈ ఇంటింటికీ పంపిణీ పద్దతిలో ఇదే ఇబ్బందులు కొనసాగితే మాత్రం ప్రజలు కూడ పాటు పద్దతే బాగుందని అనొచ్చు. అలా అంటే మాత్రం జగన్ ప్లాన్ అట్టర్ ఫ్లాపే అవుతుంది.