ఏపీలో స్థానిక ఎన్నికలు తీవ్ర వివాదాంశంగా మారిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. తమను కనీసం సంప్రదించకుండా ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని ప్రభుత్వం బాగా కోపగించుకుంది. నేరుగా సీఎం జగన్ మాట్లాడారంటే విషయం ఎంత తీవ్రంగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నిమ్మగడ్డను పదవి నుండి తొలగించడం, ఆయన కోర్టుకు వెళ్ళడం, అనేక పరిణామాల తర్వాత చివరికి గవర్నర్ జోక్యంతో తిరిగి నిమ్మగడ్డ ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నాటకీయ పరిణామాలతో స్థానిక ఎన్నికలు మరింత ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తుంటే ఇంకా కరోనా ఉధృతి తగ్గలేదు కాబట్టి ఎన్నికలు అవసరమా అనే వాదనలు వినిపిస్తున్నాయి.
అసలు ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యే పనేనా, అసలు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయనే సంకేతాలు ఏపీ ప్రభుత్వంలో కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. బీహార్ ప్రభుత్వం గడువు ముగియనుండటంతో నవంబర్ నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కరోనా రాష్ట్రంలో ఎక్కువగా ఉండటంతో ఎన్నికలను వాయిదా వేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. నేరుగా లేఖలు రాశారు కూడ. అయితే ఎన్నికలను వాయిదా వేయడం కుదిరే పని కాదని, అలా చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని, కాబట్టి ఎన్నికలు జరిపే తీరుతామని అందట.
ఇందుకోసం ఆన్ లైన్ ద్వారానే నామినేషన్ల స్వీకరణ, ఇంటింటి ప్రచారానికి అభ్యర్థులతో పాటు కేవలం 5 మందినే అనుమతించడం, ఓటింగ్ ను ఈవీఎంల ద్వారానే నిర్వహించడం, పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్, ఓటర్లకు గ్లౌజులు తప్పనిసరి లాంటి మార్గదర్శకాలు జారీ చేశారట. వీటి మధ్యన బీహార్ ఎన్నికలు సజావుగా ముగిస్తే ఏపీలో కూడా ఈసీని స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరి బీహార్ ఎన్నికలు విజయవంతం అయి ఏపీలో జగన్ సర్కార్ లోకల్ బాడీ ఎలక్షన్స్ డిమాండ్ చేస్తే ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.