బాబుకు బౌన్స్ బ్యాక్… మొన్న పీకే – నిన్న జేపీ – నేడు ఎన్ఆర్కే!

టైం బాగోనప్పుడు బంగారాన్ని ముట్టుకున్న అది మట్టి ముద్ద అయిపోతుందని అంటుంటారు. టైం బాగునప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుందని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే… ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ ను ఎలాగైనా గద్దె దింపాలని బలంగా కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవడం పర్లేదు కానీ.. ప్రజల్లో వారికి క్రెడిబిలిటీ ఏ మేరకు ఉందనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడంతో అవి కాస్త బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి!

అవును… ఈదఫా ఎన్నికల్లో గెలవకపోతే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది చంద్రబాబుకి తెలిసినంతగా ఎవరికీ తెలియదని అంటుంటారు. తర్వాత పర్యవసానాలు పూర్తిగా మారిపోయాతాయని చెబుతుంటారు. ఈ సమయంలో తన గురించి గొప్పగా చెప్పకపోయినా… ప్రస్తుత ప్రభుత్వం గొప్పది కాదని, జగన్ పాలన గొప్పగా లేదని మాత్రం చెప్పించడానికని కొంతమంది ప్రముఖులను బరిలోకి దించుతున్నారు చంద్రబాబు. అయితే వారు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు బాబునే ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయని అంటున్నారు.

ఉదాహరణకు… ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ ను తెరపైకి తెచ్చారు! ఇటీవల ఆయనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. తన వద్ద సర్వే రిపోర్టులు లేవు కానీ… వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవరని చెప్పుకొచ్చాడు పీకే. అయితే అందుకు తనవద్ద ఉన్న అథెంటికల్ రిపోర్ట్ మాత్రం ఏమీ లేదని అన్నాడు. దీంతో… తీసేసిన తహసీల్ధార్ అని ఒకరంటే… ఈ తెలివి తేటలతోనే బీహార్ లో బోల్తా పడింది అని మరొకరన్నారు.

ఇంతకూ రానున్న ఎన్నికల్లో జగన్ ఓటమికి పీకే చెప్పిన కారణం… సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇస్తున్నారని.. మధయాదాయం ఉన్న ఏపీలాంటి రాష్ట్రాల్లో అది అంత ప్రయోజనం కాదని చెప్పుకొచ్చాడు. దీంతో… తాము అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాము అని చంద్రబాబు చెప్పిన వీడియోలను వదిలారు నెటిజన్లు. దీంతో… అది కాస్తా తిరిగి తిరిగి బాబుకే తగిలిందనే కామెంట్లు వినిపించాయి. దీంతో.. పీకే వ్యూహాలకు పదునుతగ్గిందని సైడ్ చేసేశారని తెలుస్తుంది!

ఇదే సమయంలో లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణను వదిలారు బాబు! మైకులముందుకు వచ్చిన ఆయన… గాంధీ, అంబేద్కర్ లతో తనను తాను పోల్చుకున్నట్లుగా శృతిమించి మాట్లాడారు. తాను మోడీ, చంద్రబాబుకు మద్దతని ప్రకటించుకున్నారు. దీంతో… అడగాల్సినవి అడుగుతూ, కడగాల్సిన చోట కడుగుతూ జేపీని వాయించి వదిలారు మేధావులూ, విశ్లేషకులు. నిన్నమొన్నటివరకూ జగన్ పాలన్ బాగుందని వీడియోల్లో మాట్లాడి.. ఇప్పుడు రాజ్యసభ ఆఫర్ రాగానే ఇలా మాట్లాడతారా అంటూ ఆరోపణలు గుప్పిస్తూ ఫైరయ్యారు.

దీంతో… తన మాటల వల్ల మోడీ, చంద్రబాబుకు కొత్తగా పెరిగిందీ, తరిగిందీ లేకపోయినా… జయప్రకాశ్ నారాయణ మాత్రం ఏపీ ప్రజల్లో చులకన అయిపోయారానే కామెంట్లు మాత్రం వినిపించాయి. పైగా… ఇప్పుడు జేపీ చెప్పాడని ఒక ఓటు టీడీపీకి ఎక్కువ, చెప్పలేదని తక్కువ పడే పరిస్థితి లేదని అంటున్నారు. ఇది కూడా బౌన్స్ బ్యాక్ అవ్వడంతో పాటు… జగన్ చెబుతున్న క్లాస్ వార్ కామెంట్లకు మరింత బలం చేకూరినట్లయ్యిందని చెబుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎంటరయ్యారు. ఈ క్రమంలో వాలంటీర్ల వ్యవస్థపై తనదైన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. గతంలో జగన్‌ ను ఇబ్బందుల్లో పడేసి, స్థానిక సంస్థ ఎన్నికలను తెలుగుదేశానికి అనుకూలంగా మలిచేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఆరోప‌ణ‌లున్న ఆయన… ఈ సమయంలో బాబు కోసం అన్నట్లుగా మరో ప్రయత్నం చేశారు. కాకపోతే… ఇది కూడా బౌన్స్ బ్యాక్ అయ్యిందని తెలుస్తుంది.

తాజాగా రాష్ట్రంలో పరిస్థితిపై ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశం అని ఏర్పాటు చేసిన ఆయన… వాలంటీర్‌ వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లను సేవలకు దూరంగా పెట్టాలని ఆయన కోరారు! ఈ గ్యాప్ లో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకుంటారని సెలవిచ్చారు. దీంతో… ఈయన వచ్చి ఏదో చేస్తారనుకుంటే ఇంకేదో చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.

కారణం… ఈయన చెప్పినట్లుగా వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికలు అయ్యేవరకూ సేవలకు దూరంగా ఉంచితే… ఏప్రిల్, మే నెలల్లోని పింఛన్ ను లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి క్యూలో నిలబడి తీసుకుని రావాలి. ఆ సమయానికి సదరు అధికారు విధుల్లో లేకపోతే… మరుసటి రోజు కాళ్లీడ్చుకుంటూ వెళ్లాలి.. ఒకమాటలో చెప్పాలంటే చంద్రబాబు హయాంలో లాగా అన్నమాట! అదే జరిగితే… జగన్ కు అంతకుమించిన పబ్లిసిటీ ఇంకోటి అవసరం లేదు.

ఎందుకంటే… టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ ఇదే పరిస్థితి ఉంటుందని పింఛను దారులు భావించే అవకాశం మెండు. ఇలా తనకు ఏదో మేలు చేస్తారని ఒక టీంని విడతలవారీగా బాబు రంగంలోకి దింపుతుంటే… వారు తిరిగి బాబుకే దింపుతున్నారనే కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి! మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినట్లు వాలంటీర్ల సేవలు ఎన్నికలు అయ్యేవరకూ ఆపేసి… ఏప్రిల్, మే నెల పించన్ లను సచివాలయాలకు వెళ్లే తెచ్చుకోవాలని బాబు కూడా డిమాండ్ చేస్తారా? వేచి చూడాలి!!