కొత్త వైరస్… మళ్లీ చేతులు కడుక్కోవడం మొదలు!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదనేది వాస్తవం! ఆ మహమ్మారి వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, ఆర్థిక పరిస్థితులు మొత్తం తలకిందులై బాధితులుగా మిగిలిన ప్రజానికం కోట్లలో ఉంటారన్నా అతిశయోక్తి కాదు. మనిషి ప్రాణం ఎంత అల్పమో ఈ కరోనా వల్ల తెలియడమే కాకుండా.. మానవ బంధాలు ఎంత అత్యల్పమో కరోనా తెలియజేసింది.

ఇక ఈ కరోనా వైరస్ సమయంలో… ఒకటికి రెండు సార్లు చేతులు కడుక్కోవడం, శానిటైజర్ రాసుకొవడం, మాస్క్ లు ధరించడం, మనిషికి మనిషి దూరంగా ఉండటం వంటివి అతి సాధారణంగా మారిన పరిస్థితి. అయితే… తాజాగా మరోసారి ఆ పరిస్థితి వచ్చేసింది. మాస్కులు ధరించడం కంపల్సరీ కాకపోయినా.. చేతులు కడుక్కోవడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు.

దీనికంతటికీ కారణం తెరపైకి వచ్చిన కొత్త వైరస్సే.. దాని పేరు “నోరో వైరస్”! ప్రస్తుతం ఈ వైరస్ హైదరాబాద్ ను వణికిస్తోంది. అది కూడా తీవ్ర స్థాయిలో! అది ఎంతలా అంటే… వారం రోజుల వ్యవధిలోనే ఓల్డ్ సిటీలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యేటంత. ఇదే క్రమంలో… ప్రతీ రోజూ కనీసం వంద నుంచి 120 కొత్త కేసులు నమోదవుతున్నాయని అంటున్నారు.

అసలే వార్షాకాలం కావటం.. ఈసారి వర్షాలు కాస్త ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో పలు చోట్ల పరిసరాలన్ని దుర్గంధంగా మారుతున్నాయి. ఫలితంగా… రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలోనే.. పలు కొత్త వైరస్‌ లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెరపైకి వచ్చిన నోరో వైరస్ భాగ్యనగర వాసులను భయపెడుతోంది.

పైగా హైదరాబాద్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతీ ఊరికీ కనెక్షన్ ఉంటుందనేది తెలిసిన విషయమే! ఈ నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. కలుషిత నీరు, నాణ్యతలేని ఆహారం ఈ వ్యాధికి కారకంగా చెబుతున్న వైద్యులు… చలి జ్వరం, కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, నీరసం, డీహైడ్రేషన్ ఈ వ్యాధి లక్షలాణాలని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ (జీ.హెచ్.ఎం.సీ).. ప్రజలంతా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని.. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలని.. ఇంటిని పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఈ నొరో వైరస్ కేసులు హైదరాబాద్‌ లోని మలక్ పేట్, డబీర్ పురా, యాకత్ పురా, పురానీ హవేలీతో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నట్టు తెలుస్తోంది.