YS Jagan : సీఎం వైఎస్ జగన్ అది తెలుసుకుని తీరాల్సిందే.!

YS Jagan : సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ఇంత రాద్ధాంతం అవసరమా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. ఈ విషయమై పరిశ్రమ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసే అవకాశం వుండనే వుంది. సరే, అది ముందు ముందు జరగొచ్చు కూడా. కానీ, ఈ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రచారానికి నోచుకోవడంలేదు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్ళారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కొన్ని సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందజేశారు కూడా. ఇవేవీ మీడియాలో ప్రాచుర్యం పొందలేకపోయాయి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై కాస్త కవరేజ్ లభించింది. ఆయన్ను చీఫ్ జస్టిస్‌గా నియమించొద్దని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పటి చీఫ్ జస్టిస్‌కి లేఖ రాసిన విషయం విదితమే. సరే, అది గతం. ఇప్పుడు అదే జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలకాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే సంగతి.

అధికారంలో ఎవరున్నాసరే.. రాజకీయ వివాదాలు మామూలే. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు పాజిటివ్ పబ్లిసిటీ, నెగెటివ్ పబ్లిసిటీ.. రెండూ జరుగుతుంటాయి. వార్తల్లో రెండు కోణాలూ కనిపిస్తుండాలి. కానీ, వైసీపీ అనుకూల మీడియా తప్ప, ఎక్కడా వైఎస్ జగన్ పాలన పట్ల.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల సానుకూలమైన వార్తా కథనాలు కనిపించడంలేదు. కనీసం, న్యూట్రల్ కథనాలు కూడా వుండటంలేదు.

ఓ వివాదం, తమ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా.. మంచి కార్యక్రమాల్ని ప్రజలకు చేరువ కాకుండా చేస్తోందంటే.. అలాంటివాటి విషయంలో ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదనే వుంది.

మంత్రుల్ని, ఇతర ముఖ్య నేతల్నీ రంగంలోకి దించి, వాస్తవాల్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తే.. ప్రభుత్వానికీ మంచిపేరు వస్తుంది. ఈ విషయమై ముఖ్యమంత్రి ఎందుకంత శ్రద్ధ పెట్టలేకపోతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.