Janasena and BJP : జనసేనకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుందా.? ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి.?

 Janasena and BJP : జాతీయ పార్టీ, పైగా కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ. ఆ పార్టీతో రాజకీయ పొత్తు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల నేపథ్యంలో పొత్తుల రాజకీయం నడిపేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేయడం ఖాయం. రోడ్ మ్యాప్ అంటే, రెండు పార్టీలూ రాజకీయంగా కలిసి ముందడుగు వేయడం.

ఎన్నికల వేళ ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేయాలి.? అధికారంలోకి రావడానికి ఎలాంటి వ్యూహాలు రచించాలి.? ఇవన్నీ ఆ రోడ్ మ్యాప్‌లో భాగం. 2024 ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ఈలోగా రెండు పార్టీలూ కలిసి రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలి. దీనికి సంబంధించి బీజేపీ ఏం అనుకుంటుందో ఆ పార్టీ, తన విధానాన్ని జనసేన ముందుంచాలి. జనసేన కూడా తమ ఆలోచనల్ని బీజేపీతో పంచుకోవాలి. ఇద్దరూ కలిసి రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలి.

‘మేం ఇచ్చేశాం..’ అంటూ ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. సాక్షాత్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అదే విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు. కానీ, రోడ్ మ్యాప్ రావాల్సింది బీజేపీ అధినాయకత్వం నుంచి. అదెప్పుడు వస్తే, దానిపై జనసేన పార్టీ తనదైన విధానాన్ని ప్రకటిస్తుంది.

ఒకవేళ బీజేపీ గనుక రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి.? ఇదే ఇప్పుడు జనసేన వర్గాల్లో ఒకింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రోడ్ మ్యాప్ కంటే ముందు జనసేన పార్టీ, బీజేపీ నుంచి కొన్ని విషయాల్లో స్పష్టతను ఆశిస్తోంది. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై రోడ్ మ్యాప్‌లో స్పష్టత వస్తుందన్నది జనసేన ఆశాభావం. ఆ స్పష్టత లేకపోతే, జనసేన తనదైన సొంత ఆలోచనలతో సోలోగా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతుందట.