సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలోని ముస్లిం సమాజంలో సరికొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా “నమ్మకం” అనేది చాలా కీలక అంశంగా మారిపోయింది! నాయకుడు అనే వ్యక్తి ఒక మాట ఇస్తే.. ఆ మాటకు ఏ మేరకు కట్టుబడతాడు.. గతంలో ఎన్ని సార్లు కట్టుబడ్డాడు.. ముక్కు సూటిగా మాట్లాడుతూ మాటపై నిలబడే మనిషా.. లేక, రెండు నాలుకలు, రెండు కళ్ల సిద్ధాంతాలు అంటు సన్నాయి నొక్కులు నొక్కే బ్యాచ్చా అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది!
ఇప్పుడు ఏపీలో అనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా లౌకికవాదం అనే చర్చ బలంగా వినిపిస్తుంది. డివైడ్ అండ్ రూల్ పద్దతిలో పబ్బం గడుపుకునేవారిని దూరం పెట్టాలనే కామెంట్లు ఓ సమాజం నుంచి బలంగా వినిపిస్తున్నాయి! ఈ సమయంలో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు.. ఆ పొత్తుకోసం తానెంతో వెంపర్లాడినట్లు పవన్ కల్యాణ్ చెప్పుకున్నారు! దీంతో… ముస్లిం మైనారిటీ సమాజం ఏపీలో కూటమికి ఆల్ మోస్ట్ దూరం అయ్యిందనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ సమయంలో ఇటీవల ముస్లిం ఓటర్లతో మాట్లాడిన చంద్రబాబు… బీజేపీ పొత్తు ఎక్కువ కాలం ఉండదని చెప్పారు!! మరోపక్క బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు! 2014లో కూడా ఇవే మాటలు చెప్పి.. రాష్ట్రానికి చేయాల్సిన నష్టం అంతా కలిసి చేశారు.. ఎన్నికల వేళ విడిపోయినట్లు డ్రామాలు అడ్డారు అనే విమర్శ బలంగా ఉంది! వ్యక్తిగత స్వార్ధప్రయోజనాల కోసం ఈ స్థాయిలో రాష్ట్రాన్ని నాశనం చేసిన ఘనతలో ఫస్ట్ ప్లేస్ చంద్రబాబు – పవన్ లకు దక్కింది!
కట్ చేస్తే… 2024 ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఈ సమయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ జాతీయ నాయకత్వం బహిరంగంగా ప్రకటనలు చేస్తుందంటూ విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క చంద్రబాబు మాత్రం… ముస్లిం రిజర్వేషన్స్ ని ఎలా ఆపాలో తమకు తెలుసని ఢాంభికాలు పలుకుతున్న పరిస్థితి! అలా అని.. మోడీని ఏపీకి రప్పించి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి.. ఏపీ వరకూ ముస్లింలకు ఆ వెసులుబాటు ఉంటుందని చెప్పించగలరా?
అది జరిగే పని కాదనే చెప్పాలి! ఏ రోటికాడ ఆ పాట పాడేసి పబ్బం గడిపేసుకోవాలనే తాపత్రయమే తప్ప… రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు బాబుకు ఏమాత్రం పట్టవని.. ఎమోషన్స్ లేని మనిషని.. ప్రజాభిప్రాయలంటే ఆయనకు బొత్తిగా విలువ ఉండదని.. గతంలో కాపు రిజర్వేషన్స్ దగ్గర నుంచి రుణ మాఫీ పైనా, ప్రత్యేక హోదా పైనా ఆయన నాలుక మడత పెట్టిన అంశాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణలని చెబుతునారు!
ఈ సమయంలో… ముస్లిం సమాజం మిమ్మల్నెలా నమ్మాలి చంద్రబాబూ అంటూ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, ముస్లిం జేఏసీ అధ్యక్షుడు మహమ్మద్ కలీం తెరపైకి వచ్చారు! ఒకపక్క… ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ జాతీయ నాయకత్వం బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం, అదేం లేదంటూ ముస్లిం సామాజిక వర్గాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అవును… దేశ ప్రధాని మోడీ, అమిత్ షా, పీయూష్ గోయల్ లు ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని బహిరంగంగా ప్రకటిస్తుంటే… ఎన్ డీయే కూటమిలో చిన్న భాగస్వామి అయిన చంద్రబాబు మాత్రం ముస్లింలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారంటూ మహమ్మద్ కలీం ఫైరవుతున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై మిమ్మల్నెలా నమ్మాలి బాబూ అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు!
దీంతో… ఇప్పుడు ఈ విషయంపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయడమే కాదు.. బీజేపీ జాతీయ స్థాయి నేతలతో బలంగా చెప్పించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో… టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆగ్ర నాయకులు.. ముస్లిం రిజర్వేషన్లపై ఉమ్మడి మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించాలని మహమ్మద్ కలీం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు! మరి ఈ విషయంపై ఏపీలో కూటమి పెద్దలు స్పందిస్తారా.. స్పష్టమైన ఉమ్మడి ప్రకటన చేస్తారా.. లేక, “మైనారిటీ” ఓటు బ్యాంకే కదా అని లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి!