NTR : ఎన్టీయార్ సరే.. గురజాడ, పింగళి గుర్తుకు రాలేదేం.?

NTR :  స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మంచిదే.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ తిరుగులేని ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్వర్గీయ ఎన్టీయార్, తెలుగునాట రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. సో, స్వర్గీయ ఎన్టీయార్ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుని ఎవరూ వ్యతిరేకించలేరు.

అల్లూరి సీతారామరాజు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుని సైతం ఎవరూ వ్యతిరేకించరు. కానీ, గురజాడ పేరుతో ఎందుకు కొత్త జిల్లాని ఏర్పాటు చేయడంలేదు.? పింగళి వెంకయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు రాలేదు.? స్వర్గీయ ఎన్టీయార్‌ని ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుడిగా చూడాల్సి వస్తే, వంగవీటి రంగా విషయంలో అలా ఎందుకు చూడకూడదన్న ప్రశ్నకు సమాధానమెవరిస్తారు.?

కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త కొత్త వివాదాలు తెరపైకి రావడం సహజం. అదే క్రమంలో, అందర్నీ ఆలోచింపజేసే అంశాలూ తెరపైకొస్తాయి. పింగళి వెంకయ్య అంటే జాతీయ పతాక రూపకర్త. మరి, అలాంటి పింగళి వెంకయ్య పేరుని రాష్ట్రంలో ఓ జిల్లాకి పెడితే తప్పెలా అవుతుంది.? ప్రభుత్వమెందుకు ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది.?

ఇక, గుజరాడ గురించి కొత్తగా చెప్పేదేముంది.? దామోదరం సంజీవయ్య లాంటి ఎందరో మహనీయులున్నారు.. వారి పేర్లను ఆయా జిల్లాలకు పెట్టడం మనల్ని మనం గౌరవించుకోవడమే అవుతుంది. వైఎస్సార్ కడప జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.. వీటికి అదనంగా ఎన్టీయార్ జిల్లా, అల్లూరి జిల్లా, అన్నమయ్య జిల్లా.. ఈ కోవలోనే మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా పెడితే పోలా.?
అయినాగానీ, అసలు జిల్లాలకు వ్యక్తుల పేర్లు పెట్టడం ఎంతవరకు సబబు.? అన్నది ఇంకో చర్చ. ఎవరి గోల వారిది.