దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ఎన్నికలు జరిగాయి. కొన్ని ఉప ఎన్నికలు, కొన్ని స్థానిక ఎన్నికలు.. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉప ఎన్నికలు జరిగాయి, జరుగుతూనే వున్నాయి. అయితే, కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఎంతవరకు సబబు.? ఈ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు హంగామా చేయడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ గత కొంతకాలంగా జరిగింది, జరుగుతూనే వుంది.. ఈ క్రమంలోనే కరోనా వైరస్ పంజా విసిరింది.. పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని భావించి ఆయా రాజకీయ ప్రముఖులు, ప్రచారం చేసే పద్ధతిని మార్చుకున్నారు.. ఇప్పుడు నీతులు చెబుతున్నారు.
నిజానికి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభ జరగడానికి ముందు కోర్టులో ఆ సభను ఆపాలనే పిటిషన్ దాఖలయ్యింది. అది ఓ వార్నింగ్ సిగ్నల్.. అని భావించి కేసీఆర్ ఆ సభ నిర్వహించకుండా వుండి వుండాల్సిందేమో. కేసీఆర్ కరోనా బారిన పడ్డాక, ఇదే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. పైగా, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెద్దయెత్తున కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. పోటీ చేసిన అభ్యర్థి సహా పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఎంతమంది కరోనా బారిన పడ్డారన్నదానిపై స్పష్టత లేదు. నాగార్జున సాగర్ విషయంలోనే కాదు, తిరుపతి విషయంలోనూ, తమిళనాడు అలాగే పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికల విషయంలోనూ ఈ తరహా చర్చే సామాన్యుల్లో జరుగుతోంది. రాజకీయ నాయకుల బాధ్యతా రాహిత్యమే, దేశానికి ఈ రోజు కరోనా ఈ స్థాయిలో ముప్పు తెచ్చిపెట్టిందా.? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు.? ‘తెలంగాణలో నాగార్జున సాగర్ ప్రత్యేకంగా ఏమీ లేదు.. తెలంగాణలో మిగతా జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి..’ అంటూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఒకరు, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కరోనాపై వ్యాఖ్యానించడమూ వివాదాస్పదమవుతోంది.