తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్య తలెత్తడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్క ఇది. అనధికారికంగా ఇక్కడ ఆక్సిజన్ సమస్య వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య రెండింతలు.. ఆ పైన వుండొచ్చని మీడియా కథనాల్ని చూస్తున్నాం. అత్యంత దారుణమైన పరిస్థితులు కొన్ని నిమిషాలపాటు రుయా ఆసుపత్రిలో కనిపించాయి. రోగుల బంధువులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.. తమ ఆవేదన అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు తెలుస్తుందన్న కోణంలో. ఎలాగైతేనేం, అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ముఖ్యమంత్రీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిజానికి, రాష్ట్రంలో ఇదే తొలి ఘటన కాదు. విజయనగరంలో జరిగింది.. కడప, అనంతపురం ప్రభుత్వాసుపత్రుల్లోనూ జరిగింది. అయితే అవి కాస్త చిన్న ఘటనలు. ఆయా ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదంటూ అధికారులు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మరణించినవారి లెక్కల్నీ, జాగ్రత్తగా మేనేజ్ చేసేశారు. కానీ, రుయా ఆసుపత్రి వ్యవహారం ఇంకోలా వుంది. మొత్తం వ్యవహారం బట్టబయలైపోయింది. నిర్లక్ష్యమే నిండు ప్రాణాల్ని బలిగొందిక్కడ. అయితే, ఈ వ్యవహారంపై వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనీ, సోషల్ మీడియాలో భయం పుట్టించేలా కథనాలు సర్క్యులేట్ చేయొద్దనీ అధికారులు విజ్నప్తితో కూడిన హెచ్చరికలు చేస్తుండడం గమనార్హం. కరోనా వేళ ఆక్సిజన్ కొరత ఎంతలా వేధిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వం చెబుతున్న విషయాలకీ, గ్రౌండ్ లెవల్ పరిస్థితులకీ అస్సలు పొంతన వుండడంలేదు. మెడికల్ ఆక్సిజన్ కేటాయింపు కూడా కేంద్రమే చేయాల్సి రావడంతో.. రాష్ట్రాలు ప్రత్యేకంగా ఏమీ చేయలేని దుస్థితి. అయితే, ప్రచారం పరంగా రాష్ట్రాలు తమకు తోచిన రీతిలో పబ్లసిటీ స్టంట్లు చేస్తుండడంతో.. ఈ మరణాలకూ ఆయా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.