ప్రభుత్వం పరంగా వైఫల్యం వున్నాసరే.. దుర్ఘటన జరిగాక, తక్షణ సాయం బాధితులకు అందిన తర్వాతే, ఇతర్రతా విషయాల గురించి మాట్లాడుకోవాలి. తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది ప్రాణాలు ఎందుకు పోయాయి.? ఇందులో ప్రభుత్వ వైఫల్యమెంత.? అన్నది వేరే చర్చ. దుర్ఘటన జరిగిన దరిమిలా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. ఇది ఆయా కుటుంబాలకు ఎంతో కొంత ఊరటనిస్తుందన్నది నిర్వివాదాంశం. అయితే, ప్రభుత్వ వైఫల్యాన్ని ఇలా నష్ట పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటారా.? అంటూ ముఖ్యమంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తిరుపతిలో పర్యటించారు.. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగ్గా వున్నాయన్నారు. ఆక్సిజన్ సమస్య లేదు, మందుల కొరత లేదని కూడా చెప్పారు. ఇంతలోనే పెను ప్రమాదం జరిగింది.
ఆక్సిజన్ ట్యాంకర్ రావడం కాస్త ఆలస్యమయ్యిందనీ, ఈ క్రమంలోనే దుర్ఘటన చోటు చేసుకుందనీ, అధికారులు, వైద్యులు వెంటనే స్పందించి సమస్యను సరిదిద్దడంతో చాలా ప్రాణాల్ని కాపాడగలిగామనీ ప్రభుత్వం చెబుతోంది. కానీ, ట్యాంకర్ వస్తే తప్ప ప్రాణాలు నిలపలేనంత పరిస్థితికి ఆక్సిజన్ నిల్వల్ని ఎందుకు దిగజార్చారు.? ముందే అధికారులు ఎందుకు మేల్కొనలేదు.? అన్నది కీలకం ఇక్కడ. నిజమే, రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా ఆక్సిజన్ కొరత వుంది. అలాగని, పోయిన ప్రాణాల్ని లైట్ తీసుకునే పరిస్థితే లేదు. ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేసినా పోయిన ప్రాణం తిరిగి రాదు. పైగా, ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడమంటే అది ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డపేరు తెచ్చిపెడుతుంది. నిర్లక్ష్యానికి కారణమైనవారిని కఠినంగా శిక్షించడంతోపాటు, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంది.