తిరుపతి ‘బై పోల్’ సిత్రాలు: దొంగ ఓటర్ల కలకలం.!

tirupati fake voters floating

tirupati fake voters floating

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు మామూలే. కానీ, ఈసారి అంతకు మించిన వ్యవహారం నడుస్తోంది తిరుపతి ఉప ఎన్నిక సాక్షిగా. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో దొంగ ఓటర్ల కలకలం బయల్దేరింది. పెద్దయెత్తున వాహనాల్లో వచ్చిన దొంగ ఓటర్లు, తిరుపతి ఉప ఎన్నికలో ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తుండడం గమనార్హం. కార్లు, బస్సులు, ఇతర వాహనాల్లో దొంగ ఓటర్లు తిరుపతికి వస్తున్న వైనం న్యూస్ ఛానళ్ళలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా వీడియోల రూపంలో కన్పిస్తోంది. ఆయా దొంగ ఓటర్లను, విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు అడ్డగించి పోలీసులకు అప్పగిస్తున్నారు. అయితే, పోలీసులు ఆ దొంగ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళి ఓట్లేయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికల వ్యవహారం వేరు.. లోక సభ, అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం వేరు. కేంద్ర ఎన్నికల సంఘం కనుసన్నల్లో ఇవన్నీ నడుస్తాయి. కానీ, పోలీసులు, పోలింగ్ సిబ్బంది దొంగ ఓటర్లను నిలవరించలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ నేత వర్ల రామయ్య అయితే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు.

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వీరప్పన్ పెద్దిరెడ్డిగా అభివర్ణిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాత్రం, ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదనీ, అదంతా విపక్షాల కుట్రేనని ఎదురుదాడికి దిగుతున్నారు. ఓడిపోతారని తెలిసే, టీడీపీ సహా ఇతర విపక్షాలు తమ మీద విమర్శలు చేస్తున్నాయన్నది పెద్దిరెడ్డి వాదన. అధికార పార్టీ నుంచి ఖండనలు ఎలా వున్నా, దొంగ ఓటర్లకు సంబంధించి న్యూస్ ఛానళ్ళతోపాటు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న వీడియోలు.. అధికార పార్టీ స్థాయిని దిగజార్చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. 5 లక్షల మెజార్టీతో గెలిచేస్తామనన ధీమా వున్నప్పుడు అధికార పార్టీ ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నది ఓ ప్రశ్న. దొంగ ఓట్లు వేయడానికి వచ్చినవారిలో చాలామంది నిరక్షరాస్యులు.. దాంతో, తమ అసలు పేరునీ, తమ వెంట తెచ్చుకున్న దొంగ ఓటరు కార్డుల్లోని పేర్లనూ చెప్పే క్రమంలో తడబడుతున్నారు. ఓ పోలింగ్ బూత్ ఏజెంటు ఓటుని కూడా ఓ దొంగ ఓటరు వేసేందుకు ప్రయత్నించడం, తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల కలకలానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.