Then Chandrababu Now Ys Jagan : విశ్వసనీయతను కోల్పోతున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.!

Then Chandrababu Now Ys Jagan :  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ వున్న ప్రధానమైన తేడా ‘విశ్వసనీయత’. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ఈ మాట చెబుతూ వుండేవారు.. అదీ ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో.

‘రాజకీయ నాయకుడంటే ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలి. మాట, ఇచ్చి తప్పాల్సి వస్తే రాజకీయాల్లో వుండకూడదు. ప్రజల్ని మోసం చేసే వారికి రాజకీయాల్లో చోటు లేని విధంగా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాం..’ అంటూ ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో పదే పదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చేవారు.

కానీ, ఇప్పుడు ఏమయ్యింది.? ఉద్యోగుల సీపీఎస్ రద్దు విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చి, మడమ తిప్పారు. రాజధాని అమరావతి విషయంలోనూ అంతే. శాసన మండలి రద్దు సంగతి సరే సరి.! ఇవన్నీ ఒక ఎత్తు.. విద్యుత్ ఛార్జీల వడ్డన ఇంకో యెత్తు.

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు వ్యవహారం అధికార వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారబోతోంది. ‘విశ్వసనీయత అంటే ఇదేనా.?’ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

గతంలో విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ ‘బాదుడే బాదుడు..’ అంటూ నినదించిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక అదే బాదుడుతో జనం నడ్డి విరుస్తున్నారన్నది విపక్షాల విమర్శ మాత్రమే కాదు, జనం మాట కూడా.

ఒక్కసారి విశ్వసనీయతను కోల్పోతే అది మళ్ళీ సంపాదించుకోవడం కష్టమని వైఎస్ జగన్ స్వయానా చెప్పుకున్నారు. మరి, ఆయనే విశ్వసనీయతను కోల్పోతున్నారు. ప్రజలకు విశ్వసనీయత విషయమ వైఎస్ జగన్ ఏం సమాధానమిచ్చుకోగలుగుతారిప్పుడు.?