Brand New Andhra Pradesh : ఇది కదా ‘నవ్యాంధ్రప్రదేశ్’ అంటే.!

Brand New Andhra Pradesh : 13 జిల్లాలు కాదు, ఇకపై 26 జిల్లాలు. ఇదీ అసలు సిసలైన నవ్యాంధ్రప్రదేశ్. రాజధాని విషయమై నెలకొన్న గందరగోళం మినహా, ఇప్పుడంతా ఆల్ ఈజ్ వెల్.. అన్నట్లే కనిపిస్తోంది.

కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలతో కలిసి మొత్తంగా రాష్ట్రంలో ఇప్పుడు 26 జిల్లాలు.

శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు.. ఈ 26 జిల్లాల వల్ల కొత్తగా వచ్చే లాభమేంటి.? అంటే, ఆయా జిల్లాల్లో జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందుతాయి. రెవెన్యూ డివిజన్లు పెరగడంతో అక్కడా అభివృద్ధి జరుగుతుంది.

అంతిమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రమే మరిపోయింది.. అభివృద్ధి పరంగా కూడా ఈ ముఖ చిత్రం మరింత అందంగా వుండబోతోంది.
అవే నిధులు.. అదే విస్తీర్ణం కదా.? కొత్తగా అభివృద్ధి ఎలా సాధ్యం.? అంటే, దానికీ ఓ లెక్కుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వివిధ రూపాల్లో నిధులు వస్తుంటాయి.

జిల్లాల సంఖ్య పెరిగితే, జిల్లాల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. నగరాలు, పట్టణాల సంఖ్య పెరుగుతుంది.. వాటి అభివృద్ధీ జోరందుకుంటుంది.
నగరాలకు, పట్టణాలకు కేంద్రం ఇచ్చే నిధుల గురించి ఇంకాస్త గట్టిగా అడగడానికీ రాష్ట్రానికి అవకాశం దొరుకుతుంది.

రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది.. పరిశ్రమలు స్థాపించడానికీ అవకాశాలు పెరుగుతాయి. బస్టాండ్లు, ఆసుపత్రులు.. ఒకటేమిటి.? అన్నీ పెరుగుతాయ్.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన వెంటనే కొద్ది కాలంలోనే తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగింది. అప్పట్లో ఏపీని పాలించిన చంద్రబాబు ప్రభుత్వం కూడా జిల్లాల పెంపు దిశగా చర్యలు చేపట్టి వుండాల్సింది.

సరే, గతం గతః ఇకపై రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలనే ఆశిద్దాం. అయితే, ముందే చెప్పుకున్నట్లు రాజధాని అనేది ఓ లోటుగానే వుండిపోయింది ఇప్పటికీ.