వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అమరావతిని కాదని మూడు రాజధానులను ఏర్పాటు చేయడం. ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి రాజధాని అయితే తమకెలాంటి అభ్యంతరం లేదని, కొత్త నగరాన్ని గొప్పగా నిర్మించాలని చంద్రబాబుకు అసెంబ్లీ సాక్షిగా సలహా ఇచ్చారు జగన్. కానీ ఈనాడు ఉన్నపళంగా అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో రాజధానిని అమరావతి, విశాఖ, కర్నూలు జిల్లాల మధ్య పంచాలని డిసైడ్ అయ్యారు. దీంతో వేల ఎకరాలు భూములిచ్చిన రైతులు ఖంగుతిన్నారు. నమ్మి భూములిస్తే ఇదా మీరు చేసేది, మేము భూమి కట్టబెట్టింది ప్రభుత్వానికి కానీ ఒక పార్టీకి కాదని, తమ ఆశలను ఒమ్ము చేయవద్దని వేడుకున్నారు. అయినా సీఎం నిర్ణయం మారలేదు. అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకుని, గవర్నర్ చేత ఆమోద ముద్ర వేయించి గెజిట్ పాస్ చేశారు. రాజధానిని విశాఖకు తరలించే సన్నాహాలు, శంఖుస్థాపన ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇప్పుడప్పుడే తేలదని ముందే గ్రహించాం:
ఈలోపు రైతులు, ప్రజాసంఘాలు, విపక్షాలు కలిసి అమరావతిని తరలించరాదని, మూడు రాజధానుల నిర్ణయం అన్యాయమని హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు మీద స్టేటస్ కో అంటే తరలింపు పనులను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం అమలుకాబడుతున్న ఏ వ్యవహారం మీదైనా వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తే అమలుకానున్న చర్యలను తక్షణమే నిలిపివేయాలని స్టేటస్ కో ఇస్తుంది. ఎందుకంటే ఇవ్వబోయే తుది తీర్పుకు ఎలాంటి అన్యాయం జరగకూడదని, సంపూర్ణంగా ఆ తీర్పు అమలుకావాలని. ఒకవేళ తీర్పు రైతుల అనుకూలంగా వచ్చే సమయానికి ప్రభుత్వం తరలింపు పూర్తిచేస్తే ఇచ్చే తీర్పు వలన ప్రయోజనం ఏముంటుందనేది స్టేటస్ కో వెనుక ఉద్దేశ్యం.
మొదటి వర్చ్యువల్ విచారణలోనే ఈ స్టేటస్ కో ఉత్తర్వులు రావడంతో ఇప్పట్లో ఈ కేసు తేలదని పలు వాయిదాలు పడటం ఖాయమని ‘తెలుగు రాజ్యం’ అంచనావేసింది. ఆ ప్రకారమే స్టేటస్ కో పొడిగింపు జరుగుతోంది. తాజాగా విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక నిలుపుదలను సెప్టెంబర్ 21 కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. ఈలోపు ప్రభుత్వం తరపున కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేకాదు సెప్టెంబర్ 21 నుండి పిటిషన్లను రోజువారీ రీతిలో విచారణ చేస్తామని తెలిపింది. అలాగే సామాజిక దూరం లాంటి నిబంధనలను పాటించగలిగితే భౌతిక విచారణే చేస్తామని కూడ అంది. ఈ ఉత్తర్వులతో విశాఖకు కొత్త రాజధానిగా శంఖుస్థాపన జరపడం ఇప్పుడప్పుడే వీలుకాని పరిస్థితి తలెత్తింది.
2020లో జగన్ కల నెరవేరదు :
ఇప్పటివరకు పిటిషన్ల మీద జరిగిన విచారణ ప్రాథమిక విచారణ మాత్రమే. ఈ విచారణలోనే దాదాపు రెండు నెలలు ప్రభుత్వం చేతులు కట్టివేయబడ్డాయి. అలాంటిది సెప్టెంబర్ 21 నుండి రోజువారీ రీతిలో విచారణ జరగనుంది. అప్పుడు వాదోపవాదనలు గట్టిగా జరుగుతాయి. కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తాయి. అప్పుడు ఈ స్టేటస్ కో అనేది రొటీన్ వ్యవహారం అవుతుంది. ప్రతి వాయిదాలోనూ అవి కొనసాగింపబడుతూ ఉంటాయి. ఎంత వేగంగా విచారణ జరిపినా కేసు తేలడానికి ఇంకో ఐదారు నెలలు పడుతుంది. అంటే 2020లో జగన్ యొక్క మూడు రాజధానుల కల కలగానే మిగిలిపోనుంది. ఇది ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బనే అనుకోవాలి.
ఇక సుప్రీం కోర్టు ద్వారా కూడా ఈ స్టేటస్ కోను అడ్డుకోవడం అసాధ్యమని రూఢీ అయింది. ఇప్పటికే స్టేటస్ కో మీద స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరగా అలా చేయలేమని, విచారణ పూర్తయ్యేవరకు కలుగజేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సో.. వచ్చే నిలుపుదల ఉత్తర్వులను పాటించడం తప్ప ఏమీ చేయలేరు. ఇవన్నీ చాలవన్నట్టు కొత్తగా ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా ప్రభుత్వం విశాఖలోని కాలుప్పాడ కొండలో స్టేట్ గెస్ట్ హౌజ్ కట్టడానికి 30 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. ఒకవైపు స్టేటస్ కో అమలులో ఉంటే కొత్త నిర్మాణాలు ఎలా చేపడతారని, అంత భారీ భవంతి అంటే అది పాలనా పరమైన భవనమే అయ్యుంటుందని, అది కోర్టు ధిక్కరణ చర్యేనని పిటిషన్ పడింది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.