Balakrishna: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో వస్తున్న ‘అఖండ’ చిత్రం మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గతంలో వీరు చేసిన ‘సింహ, లెజెండ్’ సినిమాలకు కూడ లేని పేరు ఈ సినిమాకు వస్తోంది. ప్రాజెక్ట్ భారీ హిట్ అనే నమ్మకం ఏర్పడిపోయింది. అందుకే బాలయ్యతో సినిమాలు చేయడానికి కమిట్ అయిన నిర్మాతలు తలలుపట్టుకుంటున్నారు. ఎందుకంటే కథ దొరక్క. ‘అఖండ’ అనుకున్నట్టే భారీ హిట్ అయితే బాలయ్య మీద ప్రేక్షకుల్లో ఏర్పడే అంచనాలు మాములుగా ఉండవు. ఆ అంచనాలను అందుకోవాలి అంటే బలమైన కథ ఉండాల్సిందే. బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో ఉంటుంది.
ఇప్పటికే గోపిచంద్ కథను రెడీ చేసే పనిలో తలమునకలై ఉన్నారు. యాథార్థ ఘటనల ఆధారంగా ఈ కథ ఉండనుంది. మలినేనికి మాస్ పల్స్ బాగా తెలుసు కాబట్టి కథ విషయంలో ఎలాంటి కంగారు లేదు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ వండేస్తారు ఆయన. చిక్కంతా హారిక హాసిని నిర్మాతలకే వచ్చింది. వాళ్ళ దగ్గర బాలయ్య డేట్స్ ఉన్నాయి. గోపీచంద్ మలినేని సినిమా తరవాత వీరిదే ఉంటుంది.
డేట్స్ అయితే ఉన్నాయి కానీ ఏ దర్శకుడితో చేయాలనే క్లారిటీ లేదు. అసలు డైరెక్టర్లు ఎవరూ ఖాళీగా లేరు. దర్శకుడి సంగతి పక్కనబెడితే బలమైన కథను సెట్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. పాపులర్ రచయితల్ని కూర్చోబెట్టి కథను రెడీ చేయిస్తున్నారు. ఇప్పటికీ ఒక క్లారిటీ అనేది రాలేదట. అసలు ఎలాంటి సినిమా చేయాలో కూడ తెలియట్లేదట. అలా పెరిగిన బాలయ్య ఇమేజ్ హారిక హాసిని నిర్మాతలకు సవాల్ అయింది.