పనికిమాలిన విషయాలపై చర్చ మొదలెట్టి రచ్చ చేయడం మీడియాకి ఒక అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియా మొత్తం పార్టీలుగా చీలిపోయిన తర్వాత ఈ చర్చ.. రచ్చ పీక్స్ కి చేరుకుంది. ఎదుటి పార్టీలో చీమ చిటుక్కుమన్నా భూగోళం బద్దలు అయిందన్నట్టు రచ్చ చేయడం రివాజుగా మారిపోయింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుంభమేళా స్నానానికి కుటుంబ సమేతంగా వెళ్లడం పై జరిగిన రచ్చ కూడా ఇలాంటిదే.
పవన్ కళ్యాణ్ దక్షిణ భారత గుళ్ల సందర్శన అయిపోగానే నేరుగా ప్రయాగరాజ్ వెళ్లిపోయారు. తన సతీమణి అన్నా లెజనోవాతోపాటు కొడుకు అకీరా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆయన వెంట వెళ్లారు. ప్రయాగరాజ్ లో స్నానం చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలను, వార్తలను మీడియా బాగా కవర్ చేసింది కూడా. అయితే పవన్ కళ్యాణ్ ఒంటిపై జంధ్యం ఉందని, ఆయన ఆయన వేలికి దర్భతో చేసిన ఉంగరం కూడా ఉందని, కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించవచ్చా? చేతి వేలికి దర్భాలతో చేసిన ఉంగరం ధరించవచ్చా? పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ ఏ పవర్ ఆశించి ఆ జంధ్యం ధరించారు? నిజంగా ఆ జంధ్యంలో పవర్ ఉందా? అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ముఖ్యంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఈ రచ్చ పీక్స్ కి వెళ్ళింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేడరు పవన్ కళ్యాణ్ ఫై ఈ అంశం ఆధారంగా విమర్శలు చేశారు.
రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని పూర్తిగా వ్యక్తిగతమైన ఆయన ప్రయాగరాజ్ పర్యటనను రాజకీయం చేయాలనుకోవడం దుర్మార్గం. వ్యక్తిగతంగా ఆయన ఏ గంగలోమునిగితే వీళ్ళకెందుకు? జంధ్యం ధరించినా, దర్బలు ధరించినా పూర్తిగా అది ఆయన వ్యక్తిగత విషయం. ఇలాంటి విషయాలపై విమర్శలు చేయకూడదని కనీస ఇంగితం లేకుండా ఇష్టానుసారం నోటికి పని చెప్పడం రాజకీయం అనిపించుకోదు. ఓ రాజకీయ నాయకుడిగా జనసేన పార్టీ అధినేతగా, ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను విమర్శించాలి అనుకుంటే విధాన పరమైన విషయాలకు పరిమితం కావాలి.
8 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు? సూపర్ సిక్స్ హామీలను ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదు? సుగాలి ప్రీతి విషయంలో ప్రతిపక్షంలో ఉండగా రాద్దాంతం చేసిన మీరు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి హత్యలు, అత్యాచారాలు లెక్కకు మిక్కిలిగా జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు? రాష్ట్రంలో నిస్సిగ్గుగా రెడ్ బుక్కు రాజ్యాంగం అమలు జరుగుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడానికి ఎన్నో అంశాలు ఉండగా వాటిని వదిలేసి ఇలా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వైఎస్ఆర్సిపి పార్టీకి తగదని రాజకీయ పరిశీలకులు సైతం సూచిస్తున్నారు.
ఇంతా చేసి పవన్ కళ్యాణ్ ఏమైనా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారా? కుటుంబ సమేతంగా కుంభమేళా స్నానానికి వెళ్లారు అంతే! దీనిపై ఇంత రా ద్దాంతమా? అసలు హిందూ సాంప్రదాయంలో జంధ్యం ధరించడం అనేది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. ఉప నయనం అనంతరం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల తో పాటు పద్మశాలీలు నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు జంధ్యం ధరిస్తారు. అయితే పితృ కర్మలు చేసే సందర్భంలోనూ అంటే అంత్యక్రియల సమయంలో, ప్రముఖ క్షేత్రాలలో పితృదేవతలకు పిం డ ప్రదానం చేసే సందర్భంలో శూద్రులు అయినా సరే జంధ్యం ధరిస్తారు. చేతి వేలికి దర్భతో చేసిన ఉంగరాన్ని ధరిస్తారు.
ఆ తంతు పూర్తయిన తర్వాత వాటిని విసర్జిస్తారు. హిందూ సంప్రదాయంలో ఇది సర్వసాధారణం. కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు ప్రయాగరాజులోనే కాకుండా కాశీలోనూ, గయ లోను కూడా పితృ తర్పణాలు చేస్తారు. ఆ సందర్భంలో కులంతో నిమిత్తం లేకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా జంధ్యం ధరించవచ్చు. పవన్ కళ్యాణ్ చేసింది కూడా ఇదే. దీనికి కూడా రాజకీయాలను ఆపాదించేసి ఆయనను ఏదో బదనాం చేద్దాము అనుకుంటే విమర్శలు చేసిన వాళ్ల వెర్రితనాన్ని చూసి జాలి పడడం తప్ప మనం చేసేదేమీ లేదు.
2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరచుగా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసేవారు. ఆయనకు ముగ్గురు భార్యలని, కారు మార్చినంత సులువుగా భార్యలను మార్చేస్తాడని వ్యక్తిగతంగా దాడి చేసేవారు. ఈ రకమైన వ్యక్తిగత దాడి పవన్ కళ్యాణ్ అభిమానులను, కాపు సామాజిక వర్గంలోని వారిని తీవ్రంగా బాధించింది. తాను ముందుగా వివాహం చేసుకున్న వారితో పొసగక విడాకులు ఇచ్చిన తర్వాత మరొక వివాహం చేసుకున్నాన ని తన జీవితంలో ఇలా సంభవించిందని దీనికి తాను ఏం చేయగలనని పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చేవారు కూడా. అయినా విడిచిపెట్టకుండా ఎన్నికల ప్రచారంలో జగన్ తన దాడిని కొనసాగించారు. ఇది భూమరాంగ్ అయింది. జగన్ అభిమానించే వారు కూడా ఈ విషయంలో ఆయనతో ఏకీభవించలేకపోయేవారు. ఒకరకంగా ఈ విమర్శలు కాపు సామాజిక వర్గంలో మెజార్టీ జనాన్ని జగన్ కు వ్యతిరేకంగా ఏకం చేశాయి అంటారు.
అందుకే జగన్ను ఓడించాలి అనే కక్షతో అంతగా ఇష్టం లేకపోయినా చంద్రబాబునాయుడు తో కూటమి కట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించారు అని కొందరు విశ్లేషిస్తుంటారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి బోధపడినట్టు ఉంది. అందుకే 2024 ఎన్నికల ఫలితాలు అనంతరం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లలేదు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తే దాని మూల్యం ఏ స్థాయిలో ఉంటుందో జగన్ కి బాగా అర్థమైంది. ఇంకా ఆ పార్టీ నాయకులకు కేడర్ కు ఈ విషయంలో జ్ఞానం కలిగినట్లు లేదు. అందుకే పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు.
ఇలాంటి విషయాల్లో టిడిపి వారు కూడా నాలుగు ఆకులు ఎక్కువే చదివారు అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుతో విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు మంగళవారం జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓ బాలిక అయితే జగన్‌ను కలసిన వేళ తీవ్ర ఉద్విగ్నతకు లోనై ఆనందబాష్పాలు రాల్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపైకూడా టీడీపీ సోషల్ మీడియా నెగిటివ్‌గా ట్రోల్ చేసి తన నైజాన్ని బయట పెట్టుకుంంది. జగన్ పై వ్యక్తిగత అభిమానంతో తన సొంత మావయ్యలా భావించి ఆ అమ్మాయి కన్నీటి పర్యంత మైతే టిడిపి వారు తమ వికారాలను బయట పెట్టుకోవడం ఏమిటి?
జనం ఎమోషన్లతో కూడ ఆటలాడితే దాని ఫలితం చేదుగా ఉంటుందన్న సంగతి టీడీపీ సోషల్ మీడియా ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అయిన దానికి, కాని దానికి నోటికి పని చెబితే ఓటుకు చేటు చేస్తుంది అన్న సంగతిని మన రాజకీయ నాయకులు ఎప్పటికీ తెలుసుకుంటారో?