Gummadi Narasaiah: తెలంగాణలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నర్సయ్యకు ఓ వర్గం జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సిద్ధాంతాలు ఇప్పటికి యువతలో కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎల్లందు నియోజకవర్గంలో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అయితే ఇప్పటివరకు ఎమ్మెల్యే హోదాతో ఆయన కారు, బైకు ఏది కొనలేదు. ఇప్పటికే బస్సులోనే ఆయన ప్రయాణం.
అలాంటి నేత ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవడం కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతున్న పరిస్థితి తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, చెక్‌డ్యాంలు, ఎత్తిపోతల పథకాల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్న నర్సయ్య నాలుగుసార్లు హైదరాబాద్ వచ్చి కూడా అపాయింట్‌మెంట్ పొందలేకపోయినట్లు తెలిపారు.
సమస్యలపై చర్చించేందుకు ప్రగతిభవన్‌కు వెళ్ళిన నర్సయ్యను సిబ్బంది గేటు వద్దనే ఆపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించినప్పటికీ, సిబ్బంది నుండి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తెలిసిన నేతలు, అధికారులు అపాయింట్‌మెంట్ వస్తుందని చెబుతున్నప్పటికీ, చివరి నిమిషంలో సమయం లేదని చెప్పడం గుమ్మడి నర్సయ్యను నిరుత్సాహపరిచిందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలతోనే తాను సీఎం వద్దకు వెళ్లాలని అనుకుంటే, ఇలా ఎదురుతిరుగుతుందనుకోవలసిన అవసరమేంటని ప్రశ్నించారు. ఇటువంటి సీనియర్ నాయకుడికి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోవడం రాజకీయ వర్గాల్లో అనేక చర్చలను రేకిత్తిస్తోంది. నర్సయ్య వంటి వారిని కనీసం సమస్యలపై చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం ప్రభుత్వ పరిపాలనా ధోరణిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరి, నర్సయ్య పోరాటానికి అధికార గదుల్లో నుంచి ఎప్పుడు స్పందన వస్తుందో చూడాలి.