ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నీల్.. ఎన్టీఆర్ మాస్ అటిట్యూడ్ తో మరో పాన్ ఇండియా సెన్సేషన్ తేవబోతున్నాడు. తాజాగా లీకైన డీటైల్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు, గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా నేపథ్యంలో ఒక ఇంటెన్స్ స్టోరీ అని సమాచారం.
ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఈశాన్య మయన్మార్, థాయిలాండ్, లావోస్ ప్రాంతాల మధ్య ఉన్న డ్రగ్స్ హబ్. 1950ల నుంచి ఈ ప్రాంతం హెరాయిన్, ఓపియం సరఫరా చేసే గ్యాంగ్స్ గల మాఫియా రాజ్యంలో మారింది. సినిమాలో ఒక సామాన్య వ్యక్తి ఈ గోల్డెన్ ట్రయాంగిల్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడే లీడర్‌గా ఎదిగే కథా వెనుక ఉండే యాక్షన్, రివేంజ్, లీడర్‌షిప్ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.
తారక్ ఈ మూవీలో మాఫియా లీడర్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారట. ప్రారంభంలో సాదాసీదా వ్యక్తిగా ఉండే హీరో, గోల్డెన్ ట్రయాంగిల్‌లో గ్యాంగ్స్ ను తన స్టైల్లో నిర్వీర్యం చేస్తాడు. లీకైన ఫోటోల ప్రకారం, సినిమా 1970ల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తోంది. పాత అంబాసిడర్ కార్లు, సైకిళ్లు, సెంట్రల్ ఏషియన్ సెట్ అప్ ఆ కాలాన్ని గుర్తు చేస్తాయట.
మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కి ఏకంగా ₹360 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్. హాలీవుడ్ స్థాయి విజువల్స్, టాప్ టెక్నీషియన్స్ తో సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని అంచనా వేస్తున్నాయి. షూటింగ్ స్టార్ట్ కాకముందే ఇంత హైప్ రావడం సినిమాపై ఉన్న క్రేజ్ ను స్పష్టంగా చూపిస్తోంది.