గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలా పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్ సరికొత్త భరోసా ఇవ్వడంతో పార్టీలో జోష్ కనిపిస్తోంది. తాను ముందుండి పార్టీని నడిపిస్తానని, కార్యకర్తల కోసం నిలబడతానని చెప్పడం పార్టీ కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీని మంగళ వారం పరామర్శించిన అనంతరం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఊర మాస్ వార్నింగ్ సహజంగానే కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే బుధవారం గుంటూరు మిర్చి యార్డ్ ను సందర్శించి అక్కడి రైతుల కడగండ్లను జగన్ స్వయంగా వినడం, వారికి భరోసా కల్పించడం రైతుల్లో సంతోషాన్ని నింపింది.
2024 ఎన్నికల్లో పార్టీ అనూహ్యంగా ఓడిపోవడం కార్యకర్తలను బాగా నిరాశపరిచింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పార్టీ బలం పడిపోవడంతో అటు నాయకులు ఇటు కార్యకర్తలు డీలా పడ్డారు. దీనికితోడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసి వివిధ కేసుల్లో ఇరికించడం, దాడులు చేయడం, కొన్నిచోట్ల హత్యలకు సైతం తెగబడడం పార్టీ కేడర్ ను భయపడేలా చేసింది. దీనికి తోడు తమకు ఏమాత్రం బలం లేని స్థానిక సంస్థల్లో సైతం అధికారాన్ని అడ్డగోలుగా చేజిక్కించుకోవాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు ప్రయత్నాలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశాయి. తమ కున్న అధికార బలంతో కూటమి నాయకులు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తీరుతో వైఎస్ఆర్సిపి క్షేత్ర స్థాయిలో నిలవడం కష్టంగా మారింది. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కార్యకర్తల్లో భరోసా నింపడంతో పార్టీలో కొత్త ఉత్సాహం ఉరక లేస్తోంది.
వైఎస్ఆర్సిపి కార్యకర్తలను నాయకులను టార్గెట్ చేసుకొని పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తే ఊరుకునేది లేదని జగన్ విస్పష్టంగా చెప్పారు. తిరుపతి పిడుగురాళ్ల, తుని స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ పోలీసు అధికారులు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని మరీ జనం ముందు నిలబడతామని ఆయన చెప్పడం పార్టీ శ్రేణులకు మాంచి కిక్ ఇచ్చింది. తమ ప్రభుత్వ హయాంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చి, గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఎలా ఆదుకున్నది సోదాహరణంగా వివరించడమే కాక ఇప్పటి ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికి వదిలేసిన తీరును జగన్ తనదైన శైలిలో ఎండగట్టారు.
రైతు సమస్యలపై జగన్ మాట్లాడిన తీరు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులను ఆకర్షించింది. కూటమి ప్రభుత్వ వచ్చాక రైతు భరోసా ఇప్పటివరకు అందుకోకపోవడం పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, పండిన పంటను అయిన కాడికి దళారులకు అమ్ముకోవడం వంటి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు జగన్ చక్కటి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో 18 వేల నుంచి 25 వేల వరకు పలికిన మిర్చి ధర ప్రస్తుతం 11 వేలు కూడా రాకపోవడాన్ని జగన్ ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతుల తరఫున ప్రభుత్వంతో పోరాడుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇది రైతులను ఆకట్టుకుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడిపోతున్న రైతులకు నేనున్నానంటూ జగన్ నిలబడడం కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.
రెండు రోజులపాటు బయటకు వచ్చి అటు పార్టీ కార్యకర్తల్లోనూ, ఇటు సమాజంలోని ఒక ప్రధాన వర్గమైన రైతులలోనూ జగన్ భరోసా నింపడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊపు వచ్చినట్టయింది. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలా తరచుగా బయటకు వస్తూ వివిధ వర్గాల సమస్యలపై నిలబడి ప్రభుత్వం పై పోరాడాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో తమకి కేవలం 11 సీట్లు వచ్చినప్పటికీ 40 పర్సెంట్ ఓటు షేర్ ఇప్పటికీ తమ పార్టీకి ఉందని వైఎస్ఆర్సిపి నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఐదేళ్లపాటు జన రంజకంగా పాలించి సుమారు రెండు లక్షల 71 వేలకోట్ల రూపాయలు జనం ఖాతాల్లో జమ చేసిన జగన్ అంటే రాష్ట్రంలో ఇప్పటికీ చెక్కు చెదరని ఆదరణ ఉందని అంటున్నారు. కూటమి నాయకులు ఎన్ని దురాగతాలకు పాల్పడినా, దౌర్జన్యాలకు అరాచకాలకు తెర లేపినా తాము వెనుకడుగు వేయబోమని చెబుతున్నారు.