ఔను… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేశ్ ను చేస్తే తప్పేంటి అన్న వాదనలు తెలుగుదేశం పార్టీలో ప్రబలంగా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు తండ్రీ చాటు తనయుడిగా గుంపులో గోవిందలా పార్టీలో ఉన్న లోకేష్ 2024 ఎన్నికలలో కూటమి గెలిచిన అనంతరం టిడిపిలో ఒక ప్రబలమైన శక్తిగా ఎదిగారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ తీసుకునే కీలక నిర్ణయాలలో ఆయన భాగస్వామ్యం తప్పనిసరి అవుతోంది. అందుకే లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ పార్టీలో మొదలైంది. 2029 నాటికి వైయస్సార్సీపి తరఫున జగన్మోహన్ రెడ్డి, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నాయకులుగా ఎన్నికల గోదాలోకి దిగుతారు.
ఇప్పటికే వృద్ధాప్యం మీద పడిన చంద్రబాబునాయుడు అప్పటికి వయసు రీత్యా వారితో పోటీ పడలేరన్నది ఒక వాదన. వారికి దీటుగా టిడిపి తరఫున బలమైన నాయకుడిగా లోకేశ్ ను ఇ ప్పటి నుంచే తెరమీదకి తీసుకురావాలనేది ఆ వర్గం వాదన. పైగా చంద్రబాబు పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం నాలుగో దఫా సీఎంగా ఉన్నారు. ఇంతటి సీనియార్టీ ఉన్న నాయకుడు పార్టీలో ఉంటే మరో నాయకత్వం ఎదగడం చాలా కష్టం. ప్రస్తుతం లోకేష్ ఎంత కష్టపడుతున్నా, ఎంత పవర్ ఎక్సర్ సైజ్ చేస్తున్నా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండదు. క్రెడిట్ అంతా చంద్రబాబు ఖాతాలోకి పోతుంది.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఉనికికి కీలకమైన చంద్రబాబు కేంద్ర మంత్రి పదవి తీసుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళితే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు తలపోస్తున్నారు. దేశ రాజకీయాల్లోనే సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు.. ఒక 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిమితం అవడం తగదని, ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వారు కోరుకుంటున్నారు. పైగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు చంద్రబాబుకు ఓపిక ఉండగానే పార్టీ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, లోకేష్ కు పగ్గాలు అప్పగించాలని సూచిస్తున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో అంటే 2019 నుంచి 24 వరకు టిడిపిలో లోకేష్ నాయకత్వాన్ని ఎవరూ గుర్తించలేదు. ప్రతిపక్షాలతో పాటు పార్టీలో సీనియర్ నాయకులు కూడా అతన్ని ఒక “పప్పు’ గానే పరిగణించారు. అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు కూడా పార్టీ లేదు.
బొ.. లేదు అని లోకేషన్ ఉద్దేశించే వ్యాఖ్యానించారు కూడా. అయితే అదే అచ్చం నాయుడు ఇటీవల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేశ్ బాబే నాయకుడు అన్న విషయాన్ని రాష్ట్రంలో ఏ చిన్న కుర్రాడిని అడిగినా చెబుతాడు అని వ్యాఖ్యానించారు. అదే పవర్ మహిమ! పార్టీ అధికారంలో లేనప్పుడు లోకేష్ నాయకత్వాన్ని ఒక అచ్చం నాయుడే కాదు . సీనియర్ నాయకులు చాలామంది వ్యతిరేకించారు. కానీ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చాక మొత్తం సీన్ మారిపోయింది. అప్పుడు లోకేష్ ను వ్యతిరేకించిన నాయకులు ఇప్పుడు లోకేష్ ను భుజానికి ఎత్తుకుంటున్నారు. యువ గళం పాదయాత్ర నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో లోకేష్ గణనీయమైన పాత్ర పోషించారని, ఆయన రెడ్ బుక్కు కాన్సెప్ట్ పార్టీలో ఒక జోష్ తీసుకువచ్చిందని పొగడ్తలు అందుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉంది ఏ కారణం వల్లనైనా పార్టీకి మళ్ళీ కష్ట కాలం వస్తే ఈ సీనియర్లంతా లోకేష్ కు ఎదురు తిరిగే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు లోకేశ్ కు సీఎం పదవి అప్పగించి ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళితే తెలుగుదేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని అంటున్నారు.
పైగా లోకేష్ కూడా పార్టీలో ప్రస్తుతం కీలక పాత్ర పోషించడమే కాకుండా తన సత్తా ఏమిటో ఇప్పటికే రుజువు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా పార్టీలో జోష్ నింపడమే కాకుండా తాను గతంలో ఓడిపోయిన మంగళగిరి నుంచే 90 వేల మెజార్టీతో గెలిచి తన సత్తా ఏమిటో చాటి చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లోకేష్ ఫుల్ స్వింగులో ఉన్న ఈ తరుణంలోనే ఆయనకు సీఎం గిరి అప్పగించడం సముచితమని పలువురు సూచిస్తున్నారు. ఇప్పుడు తటపటా యిస్తే తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు కూడా. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో ఈ విధంగా తట పటాయింబట్టే కేంద్రంలో ఆ పార్టీ బలం గణనీయంగా తగ్గిపోయింది అని గుర్తు చేస్తున్నారు.
అప్పుడున్న పరిస్థితుల్లో 2004లో మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా చేసినప్పటికీ రెండో దఫా అంటే 2009లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసి ఉంటే కేంద్ర రాజకీయాల తీరు మరోలా ఉండేదని అంటున్నారు. ఒకసారి ప్రధానమంత్రిగా చేసిన వాడిగా మోదీని ఎదుర్కొనగల నాయకుడిగా జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ నిలబడే వారిని చెబుతున్నారు. అలాంటి అవకాశాన్ని వదులుకొని కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యమే చెల్లించింది. అటువంటి తప్పును చంద్రబాబు చేయకూడదని, పార్టీ పదికాలాలు బతకాలంటే ఆయన లొకేశ్ కు సీఎం పగ్గాలు అప్పగించాలని అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు అఖిలేష్ యాదవ్ ను, తమిళనాడులో కరుణానిధి అతని కుమారుడు స్టాలిన్ ఈ విధంగానే తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ రెండోదఫా అంటే 2018లో అధికారంలోకి వచ్చాక తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేసి ఉంటే రాజకీయం మరోలా ఉండేది. ఇప్పటికీ ఆయన సీఎం రేవంత్ తో ఎంత మాటల యుద్ధం చేసిన ఆయనది మాజీ మంత్రి హోదానే. అదే ఒకసారి సీఎం చేసి ఉంటే… మాజీ ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ తో డీ అంటే డీ అన్నట్టు పోటీ పడేవారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అంటే 2029 ఎన్నికల నాటికి జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పవన్ ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికల బరిలో నిలుస్తారు. వారికి పోటీ ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడుకు అప్పటికి ఓపిక అయిపోతుంది. ఒక మాజీ మంత్రిగా ఉన్న లోకేష్ అటు పార్టీలో సీనియర్లు పట్టించుకోక, ఇటు జగన్, పవన్ లతో తలబడలేక ఎన్నికల బరిలో నిస్సహాయంగా నిలిచిపోతారు.

అందుకే పార్టీలో సీనియర్లు ఏమనుకుంటారు అని, కూటమి భాగస్వామ్య పార్టీలు అంగీకరిస్తాయో లేదోనని చంద్రబాబు ఆలోచించినక్కరలేదు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లనే టిడిపి గెలిచింది అనే వాదన సరైంది కాదు, నిజంగా జనసేనకు అంత సత్తా ఉంటే 2019 ఎన్నికల్లో కేవలం ఒకే స్థానాన్ని ఎందుకు గెలుస్తుంది.
టిడిపికి జనసేన ఎంత అవసరమో జనసేన కూడా టిడిపి పొత్తు అంత అవసరం. చరిత్రలోనే తిరుగులేని మెజార్టీ స్థానాలను సాధించిన ఈ సమయంలో మరో ఆలోచన లేకుండా చంద్రబాబు లోకేశ్ ను సీఎం చేస్తే అటు పార్టీ భవిష్యత్తుకు ఇటు చంద్రబాబు లెగసీ కంటిన్యూ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని పార్టీ వీరాభిమానులు ఘంటాపథగా చెబుతున్నారు.



