లారీలు, బస్సుల్లో జనాన్ని తరలించలేదు. బిర్యానీ ప్యాకెట్లు, మందు సీసాలు పంపిణీ చేసి మనిషికి ఎంత అని ఇవ్వనేలేదు. అధికారాన్ని దుర్వినియోగం చేసి నియోజకవర్గాల వారీగా, తండోపతండాలుగా జనాన్ని తోలుకు రాలేదు. అయినా అదే జన ప్రభంజనం. ఇసుకేస్తే రాలనంతగా.. పోలీసులను, వారు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం తోసుకొచ్చేంతగా.. ఏమిటీ ఆదరణ? జనంలో ఎందుకు ఈ పులకరింత? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనాల్లోకి వస్తే ఎందుకంతగా బ్రహ్మరథం పడుతున్నారు. ఇది దేనికి సంకేతం అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
జగన్ వరుసగా రెండురోజులపాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో పర్యటించారు. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుతో విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు మంగళవారం, గుంటూరు మిర్చి రైతుల సమస్యలను వినేందుకు బుధవారం జగన్‌మోహన్‌రెడ్డి ఈ నగరాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, ఒక్క సెల్ఫీ దిగేందుకు వివిధ వర్గాల జనం పోటీ పడ్డారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆయన కోసం ఎగబడ్డారు. విజయవాడలో ఓ బాలిక అయితే జగన్‌ను కలసిన వేళ తీవ్ర ఉద్విగ్నతకు లోనై ఆనందబాష్పాలు రాల్చడం సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా.
అయితే ఎప్పటిలాగా దీనిపైకూడా టీడీపీ సోషల్ మీడియా నెగిటివ్‌గా ట్రోల్ చేసి తన నైజాన్ని బయట పెట్టుకుంంది. జనం ఎమోషన్లతో కూడ ఆటలాడితే దాని ఫలితం చేదుగా ఉంటుందన్న సంగతి టీడీపీ సోషల్ మీడియా గుర్తించకపోవడం శోచనీయం. జనంలో ఇంత స్థాయిలో అభిమానం ఉన్న నాయకులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్, వైఎస్సార్ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని నిస్సందేహంగా చెప్పవచ్చని పలువురు అంటున్నారు. అధికారం ఉన్నా లేకున్నా సమాజంలోని అన్ని వర్గాల్లో అభిమాన జనం ఉండడం వీరి ప్రత్యేకతగా కనిపిస్తోంది.
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలే గెలిచి ఘోరమైన ఓటమిని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కు ఈ స్థాయిలో జనంలో ఆదరణ లభించడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇంతటి ఆదరణ ఉన్న నాయకుడికి, 151 సీట్లతో జనరంజకంగా, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా పనిచేసిన పార్టీకి కేవలం 11 స్థానాలే రావడం ఏమిటన్న చర్చ ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తోంది. ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి సొంతంగా నిర్వహించుకున్న సర్వేల్లో కానీ, దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న క్రెడిబులిటీ ఉన్న స్వచ్ఛంద సంస్థలు, మీడియా హౌస్‌లు చేసిన సర్వేల్లో కానీ వైఎస్సా్‌ర్ సీపీ అఖండ విజయం సాధిస్తుందని రిపోర్టులు వచ్చాయి. కానీ అనూహ్యంగా 175కు 164 సీట్లు గెలిచి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి.
కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దేశవ్యాప్తంగా జనాన్ని నివ్వెరపోయేలా చేశాయి. ముఖ్యంగా ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓడిపోవడాన్ని జనంతోపాటు సమాజంలోని వివిధ వర్గాలవారు నమ్మలేకపోయారు. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వివిధ పార్టీల వారు, స్వచ్ఛంద సంస్థలు సైతం ఎలక‌్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించిన తీరుపై, ఆసలు ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని స‍్వచ్ఛంద సంస్థలైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లను అదే ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో జాతీయ స్థాయి మీడియా సమావేశాల్లో ప్రదర్శించి చూపాయి కూడా.
ఆ సంస్థలు అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టాయి. సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం, అప్పటికే క్యూ లో ఉన్నవారిని ఓటింగ్ అనుమతించడం వల్ల ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఎన్నడూ లేనంతగా 12 నుంచి 17 శాతం ఓటింగ్ ఐదు గంటల తర్వాత జరిగినట్టు ఎన్నికల కమిషన్ ఆ మరుసటి రోజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఓటింగ్ శాతం ఈ స్థాయిలో పెరగడం అసాధారణమని, ఇందులో ఏదో మతలబు ఉందని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. మాజీ ఎన్నికల కమిషనర్లు కూడా మీడియా సమావేశంలో ఈ విధంగా ఓటింగ్ శాతం పెరగడం అసాధ్యమని తేల్చి చెప్పారు.
ఈ విషయమై దేశవ్యాప్తంగా ఎంతో చర్చ నడిచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా ఈవీఎం పనితీరుపై సందేహం వ్యక్తం చేశారు. అంతెందుకు 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీ సైతం మీడియా సమావేశాలు నిర్వహించి ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయవచ్చో ప్రదర్శించి చూపింది కూడా. మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో సైతం ఈవీఎంల మాయ వల్లనే ఫలితాలు తారుమారయ్యాయని పలు కోణాల్లో ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిపై
ఇప్పటి వరకూ భారత ఎన్నికల కమిషన్ ప్రజలకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. ఇన్ని సందేహాల నేపథ్యంలో జగన్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోవడం ఈవీఎం మాయ వల్లనేనని జనంతో పాటు ఆ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు. జనంలో ఇప్పుడు ఆయనకు లభిస్తున్న ఆదరణను చూసి ఈవీఎం కారణంగానే జగన్ ఓడిపోయారా అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఎన్నికలను ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్ధతిలో కొనసాగించాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా విపక్షాల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. అమెరికా, ఇంగ్లండ్ వంటి అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ట్యాంపరింగ్‌కు అవకాశం ఉందన్న కారణంతో ఈవీఎంలను ఎప్పడో పక్కనబెట్టారు. అక్కడ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అటువంటప్పుడు మనదేశంలో ఎందుకు బ్యాలెట్ పద్దతిని అనుసరించకూడదు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయినా ఎన్నికల కమిషన్ తన మౌనాన్ని వీడడం లేదు.
క్రమం తప్పకుండా పథకాలను అమలు చేసి రాష్ట్రంలో సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు జనంలో తిరుగులేని ఆదరణ ఉందని జగన్ ఎప్పుడో స్పష్టంగా చెప్పారు. కేవలం ఈవీఎంల మాయాజాలం వల్లనే తమ పార్టీ ఓడిపోయిందని జగన్ చెప్పిన మాటలు ప్రస్తుతం ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తే నిజమేనేమో అన్న సందేహం కలుగుతోంది.