డాలర్ శేషాద్రిపై అప్పుడు విమర్శలు.. ఇప్పుడు దిగ్భ్రాంతులు.!

డాలర్ శేషాద్రి.. అంటే, శ్రీవారి బంగారు డాలర్ల దొంగ.. అనే స్థాయిలో ఒకప్పుడు ప్రచారం జరిగింది. ఆ డాలర్ శేషాద్రి ఈ రోజు తెల్లవారుఝామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారన్న వార్తతో ఒక్కసారిగా అటు టీటీడీ, ఇటు రాజకీయ పార్టీలు తీవ్ర దిగ్రభాంతిని వ్యక్తం చేసేశాయి.

డాలర్ల కుంభకోణం జరిగిందా.? ఆ కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు.? అన్న విషయాల్ని పక్కన పెడితే, టీటీడీ పరువుని బజార్న పడేసింది ఆ ఘటన. డాలర్ శేషాద్రిపై తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చాయి. ఆ డాలర్ల కుంభకోణం నేపథ్యంలో ‘డాలర్’ శేషాద్రి పేరు మార్మోగిపోయింది అప్పట్లో.

గతంలో ఆయనపై విమర్శలు చేసిన చాలామంది నాయకులు, ఇప్పుడు డాలర్ శేషాద్రి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఘనంగా నివాళులర్పించేస్తున్నారు. ఇదెక్కడి వింత.? అని సాధారణ ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు.

డాలర్ శేషాద్రి మీద గతంలో తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చినా, శ్రీవారి బంగారు డాలర్ల కుంభకోణంలో ఆ తర్వాత ఆయనకు క్లీన్ చిట్ వచ్చింది. రాజకీయ ప్రముఖుల వెంట తిరిగి, ఆ కేసు నుంచి ఆయన బయటపడ్డారనే వాదనలు ఇప్పటికీ వినిపిస్తుంటాయనుకోండి.. అది వేరే సంగతి.

ఏదిఏమైనా, డాలర్ శేషాద్రి చివరి శ్వాస వరకూ శ్రీవారి సేవలోనే నిమగ్నమైన మాట వాస్తవం. దైవ కార్యం కోసం.. అందునా, శ్రీవారికి సంబంధించిన కార్యక్రమం కోసం విశాఖ వచ్చి, అనూహ్యంగా గుండెపోటుకు గురై డాలర్ శేషాద్రి తనువు చాలించారు.