పోలవరం ప్రాజెక్టు: టీడీపీ, వైసీపీ.. ఎవరి వైఫల్యమిది.?

2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందని వైసీపీ ప్రభుత్వం కొన్నాళ్ళ క్రితం ప్రకటించింది. ఆ లెక్కన పోలవరం ప్రాజెక్టు నేడు జాతికి అంకితమవ్వాల్సి వుంది. కానీ, అలా జరగలేదు. సోషల్ మీడియాలో మాత్రం సెటైర్ల రూపంలో పోలవరం ప్రాజెక్టు వార్తల్లోకెక్కింది.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పుణ్యమా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేయబోతున్నారట.. చూడటానికి మేం వెళుతున్నామంటూ మీమ్స్ సృష్టిస్తున్నారు నెటిజనం. వాస్తవానికి 2021 జూన్‌లోనే ప్రాజెక్టు పూర్తవ్వాల్సి వుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే 2018లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది.

ఎప్పుడో బ్రిటిష్ హయాంలో పోలవరం ప్రాజెక్టు గురించిన ఆలోచన మొదలైతే, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఇన్నాళ్ళయినా పోలవరం ప్రాజెక్టు కల సాకారం కాలేదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఓ జాతీయ ప్రాజెక్టుని ఏడున్నరేళ్ళలో పూర్తి చేయలేకపోవడమంటే.. ఇంతకన్నా పెద్ద వైఫల్యం ఇంకేముంటుంది.?

సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, పోలవరం ప్రాజెక్టు ఆవశ్యక్తను గుర్తించి, చిత్తశుద్ధితో ప్రాజెక్టు పూర్తి చేయలేకపోతోంది.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తాయి. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పేరుతో పబ్లిసిటీ స్టంట్లు నడిచిన మాట వాస్తవం. కానీ, వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ జరుగుతున్నది అదే.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, పోలవరం ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం భుజానికెత్తుకోలేదు. జాతీయ ప్రాజెక్టు గనుక కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చి, సరైన రీతిలో పర్యవేక్షణ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుని పూర్తి చేసి వుండేది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ఇది ప్రభుత్వాల వైఫల్యమే కాదు, పార్టీల వైఫల్యం కూడా. అదే ప్రజలకు శాపంగా మారుతోంది.