Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం అత్యద్భుతమైన ‘వేదిక’ సిద్ధం.!

Pawan Kalyan : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? ప్రతిసారీ పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి అవకాశాలే కలిసొస్తున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో అధికార పీఠమెక్కే ఛాన్స్ పవన్ కళ్యాణ్ వదిలేసుకున్నారని ఆయన అభిమానులు భావిస్తుంటారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి వుంటే, ఈరోజు రాజకీయాలు ఇంకోలా వుండేవని వాపోతుంటారు.

2019 ఎన్నికల్లోనూ మంచి ఛాన్స్ పవన్ కళ్యాణ్‌కి వచ్చింది. కానీ, దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. టీడీపీ ట్రాప్‌లో పడిపోయి జనసేన దారుణంగా దెబ్బతినేసింది. ఆ తర్వాత కూడా రాజకీయంగా తప్పటడుగులే. బీజేపీని వదిలించుకోవడం తప్ప, జనసేన బాగుపడటానికి మరో మార్గమే లేదు.

బీజేపీ తన గోతిని తానే తవ్వుకున్న దరిమిలా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలివిగా ఆ పార్టీకి దూరంగా జనసేన పార్టీని జరపాల్సి వుంది. అదే గనుక పవన్ చేయగలిగితే, రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభావవంతమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ మారే అవకాశం వుంది.

ఈ విషయమై జనసేన పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఓ వైపు మండల కమిటీలు ఏర్పాటు చేస్తూ, పార్టీని బలోపేతం చేస్తున్న పవన్ కళ్యాణ్, పార్టీ శ్రేణులకు బీజేపీ విషయమై మాత్రం స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేకపోతున్నారు. ‘బీజేపీతో మేం కలిసి పని చేయలేం..’ అని జనసైనికులు తెగేసి చెబుతున్నా, అధినేత పవన్ మాత్రం, వారి ఆవేదనను అర్థం చేసుకోవడంలేదు.

ఇంతకు మించిన వేదిక, సందర్భం.. బహుశా పవన్ కళ్యాణ్ కోసం ఇంకోసారి సిద్ధంగా వుండే ప్రసక్తే దొరక్కపోవచ్చు.