Visakhapatnam : విశాఖకు మరో షాక్ ఇచ్చిన మోడీ సర్కార్.!

Visakhapatnam :విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఇచ్చేసినట్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే కేంద్రం ప్రకటించేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన నేపథ్యంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, వీటితోపాటుగా దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు.. వీటిని విభజన చట్టంలో అప్పటి మన్మోహన్ ప్రభుత్వం పెట్టిన విషయం విదితమే. రాజ్యసభ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాని అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రకటించారు.

ప్రత్యేక హోదా సహా అన్నిటికీ మంగళం పాడేసిన మోడీ ప్రభుత్వం, విశాఖ రైల్వే జోన్ విషయంలో మాత్రం ‘తూతూమంత్రంగా’ సానుకూల ప్రకటన చేశారు. వాల్టేరు డివిజన్‌‌ని రెండు ముక్కలు చేసి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ని ప్రకటించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే, ఇప్పుడు ఆ రైల్వే జోన్ కూడా లేనట్టే వుంది. తాజాగా కేంద్రం పార్లమెంటు సాక్షిగా కొత్త రైల్వే జోన్లపై చేసిన ప్రకటనలో విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేకుండా పోయింది. పేర్కొన్న లిస్టులో విశాఖ రైల్వే జోన్ లేదు. కొత్త రైల్వే జోన్ల ప్రస్తావనా లేదు. సో, విశాఖ కేంద్రంగా ప్రకటితమైన రైల్వే జోన్ విషయంలో మోడీ సర్కార్ యూ టర్న్ తీసుకుందనే అనుకోవాలి.

నిజానికి, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఇప్పటికే నిలదీసి వుండాలి. గతంలో చంద్రబాబు సర్కార్ సైతం చూసీ చూడనట్టు వదిలేసింది. ఇప్పుడు వైఎస్ జగన్ సర్కార్ కూడా అలాగే వుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కాగా, విశాఖ రైల్వే జోన్ విషయమై వెనక్కి తగ్గలేదని బీజేపీ చెబుతోంది. ఆ పనులు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. రైల్వే జోన్ ప్రకటన, దానికి ఓ పేరు కూడా ఇప్పటికే ఖరారైపోయినా, కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడంతో అనుమానాలు తలెత్తాయి. తాజాగా కేంద్ర ప్రకటనతో విశాఖ రైల్వే జోన్ అటకెక్కినట్లే భావించాలేమో.