ముందస్తు హెచ్చరిక… ఆ ఉచిత హామీ విషయంలో రెడ్ సిగ్నల్!

రోజు రోజుకీ ఉచిత హామీల రాజకీయాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వీటికి కారణం జనాలా, నాయకులా అని అడిగే ప్రశ్నకు కోడు ముందా గుడ్డు ముందా అనే సమాదానం వస్తున్నప్పటికీ… నాయకులు మారితే జనాలు మారతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు ఈ చర్చకు అవకాశం ఇచ్చిన అంశం… ఉచిత గ్యారెంటీ పథకాలు.

అవును…. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఉచిత గ్యారెంటీలు ప్రధాన భూమిక పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధానంగా చర్చనీయాంశం అయిన “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం” హాట్ టాపిక్ గా మారింది. దీనివల్ల మహిళలకు రోజుకి ఎన్ని రూపాయలు ప్రయోజనం అనే సంగతి కాసేపుపక్కనపెడితే ఆర్టీసీకి రోజుకి సుమారు 4 కోట్లు, నెలకు 120 కోట్లు, సంవత్సరానికి 1440 కోట్ల రూపాయలు అధనపు భారం పడే అవకాశం ఉందని అంటున్నారు.

మరోపక్క ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులోకి తెచ్చారో… కచ్చితంగా భారీ సంఖ్యలో కొత్త బస్సులు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. నిన్నటివరకూ ఆటోల్లో తిరిగినవారు సైతం బస్ స్టాండులకు బయలుదేరే అవకాశం ఉంది! ఈ సమయంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రైవేటు బస్సులు, ఆటోలు, క్యాబ్స్ ల డ్రైవర్లు ప్రత్యక్ష నరకం చూస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 – 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలో కూడా జగన్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తుంది. తాను అధికారంలో ఉండగానే ఈ పథకం అమలులోకి తేవడం వల్ల… విపక్షాలకు ఆ హామీని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం కూడా ఇవ్వకూడదనేది స్కెచ్ అని అంటున్నారు. అయితే ఏపీ సర్కార్ ఈ నిర్ణయం దిశగా ఆలోచన చేయడమే కానీ, సీనియర్ అయిన చంద్రబాబు సైతం ఇప్పటికే వరుస ఉచిత హామీలు ఇచ్చేస్తున్న విధానం కానీ… రాష్ట్రాన్ని మరింత వెనక్కి నెట్టేయడమే అని అంటున్నారు పరిశీలకులు.

వైఎస్ జగన్ ఉచిత హామీల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెబుతూనే…. మరోపక్క తాము అధికారంలోకి వస్తే ఆ ఉచిత పథకాలు కంటిన్యూ చేస్తూనే, మరింత ఎక్కువగా ఇస్తామని చెప్పడం ఏపీ నాయకులకే చెల్లింది. ఈ సమయంలో తాజాగా ఏపీలో ఆటోడ్రైవర్లు రోడ్లపైకి వచ్చారు.

మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్రయాణ నిర్ణయాన్ని విర‌మించాల‌ని, త‌మ క‌డుపు కొట్టొద్దంటూ విశాఖ‌లో ఆటో కార్మికులు భారీ ర్యాలీ త‌ల‌పెట్టారు. ఏపీలో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం వద్దంటూ ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగుతున్నారు. మహిళల ఉచిత బస్సు జర్నీ హామీ విషయంలో అన్ని పార్టీలూ ఆలోచించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దీంతో ఏపీ సర్కార్ పునరాలోచన చేసే అవకాశం ఉందా.. లేక, మోండిగా ముందుకెళ్లి కొత్త కష్టాలు తెచ్చుకునే ప్రమాదం ఉందా అనేది వేచి చూడాలి. ఇదే సమయంలో ఈ హామీ ఒక్కటే అటు కర్ణాటకలోనూ, తెలంగాణలోనూ కాంగ్రెస్ కు అధికారం తెచ్చిపెట్టింది అని నమ్మితే చంద్రబాబు కంటే అమాయకులు ఎవరూ ఉండరనే కామెంట్లూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అక్కడున్న ప్రభుత్వంపై విపరీతంగా వచ్చిన అవినీతి ఆరోపణలకు తోడు ఈ హామీ మరో ఉడత సాయం చేసి ఉండొచ్చు తప్ప… ఇదొక్కటే అనుకుంటే పొరపాటే. చంద్రబాబు లాంటి సీనియర్ అయినా… సంపద సృష్టించే దిశగా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా హామీలు ఇవ్వాలి కానీ… ఉచితాలు ఉచితాలు ప్రకటిస్తే ఇంటర్నల్ ప్రాబ్లంస్ తో రాష్ట్రం నిజంగానే శ్రీలంక అయ్యే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలకు జగన్ అతీతుడు కాదనేది జగమెరిగిన సత్యమే!