ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కేసు కంప్లీట్ డిటైల్స్!

విశాఖలో జరిగిన ఎంపీ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. విశాఖలో అధికారపార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబీకులు కిడ్నాప్ కు గురయ్యారు. అవును ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్ కిడ్నాప్ తోపాటు ఎంపీ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)ని కిడ్నాప్ చేశారు. జీవీ వృత్తిరీత్యా ఆడిటర్‌ అయినప్పటికీ… వైసీపీలో కీలక నేతగా ఉండటం గమనార్హం.

ముందుగా ఎంపీ కుమారుడు శరత్ ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. ఆనందపురంలో ప్రత్యేకంగా నివాసముంటున్న సమయంలో ఎంపీ కుమారుడిని కిడ్నాప్ చేశారట. అప్పుడు ఎంపీ భార్యకు కిడ్నాపర్ లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో కంగారు పడి డబ్బులు తీసుకెళ్లిన ఎంపీ భార్యను సైతం కిడ్నాప్ చేశారు.

అనంతరం ఎంపీ కుటుంబ ఆడిటర్ గా ఉంటూ, ఆ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా ఉండే ఆడిటర్ జీవీకి ఫోన్ చేశారు కిడ్నాపర్ లు. దీంతో కొంత డబ్బు తీసుకున్న జీవీ… కిడ్నాపర్ లు పంపిన లొకేషన్ కు వెళ్లగా… ఆయన్ని కూడా కిడ్నాపర్ లు అదుపులోకి తీసుకున్నారు. అయితే బుదవారం మధ్యాహ్నం జరిగిన ఈ వ్యవహారం గురువారం ఉదయానికి పోలీసులకు తెలిసింది.

ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా రౌడీ షీటర్ హేమంత్ ను పేర్కొన్నారు పోలీసులు. గతంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు, కార్పొరేటర్ గా ఉన్న విజయశ్రీ రెడ్డి ని దారుణంగా హత్య చేసిన చరిత్ర ఇతనికి ఉందట. ఇదే విధంగా అనేక బ్లాక్ మెయిలింగ్ కేసుల్లో కూడా ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదే విషయంపై మరింత డిటైల్డ్ గా స్పందించారు విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రం వర్మ. తమకు ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ మేరకు సమాచారం వచ్చిందని తెలిపిన సీపీ… ముందుగా జీవీ కిడ్నాప్ అయినట్లు తమకు తెలిసిందని, అనంతరం ఆయనతోపాటు ఎంపీ భార్య, కుమారుడు కూడా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

దీంతో కిడ్నాపర్ లు ప్రయాణిస్తున్న కారును గుర్తించిన పోలీసులు సినీ ఫక్కీలో ఛీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. ఈ ఛెజింగ్ లో ఒక పోలీస్ జీప్ ధ్వంసమవ్వగా.. కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. ఆఖరికి నిందితులు ఇద్దరినీ ఛేజ్ చేసిపట్టుకున్న పోలీసులు… బాధితులుల్ ముగ్గిరిని సేవ్ చేశారు.